
ముంబై: ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ నాయకులు, మేధావులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, మీడియా ప్రతినిధులు ఒకే వేదికపైకి రానున్నారు. ప్రపంచ హిందూ కాంగ్రెస్ (WHC)–2026 డిసెంబర్ 18 నుంచి 20 వరకు ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్నారు. **“సమనం వ్రతం సహ చిత్తం”** (ఉమ్మడి నిబద్ధత–సామూహిక సంకల్పం) ఇతివృత్తంతో జరిగే ఈ సదస్సులో హిందూ సమాజ అభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ, విద్య, ఆర్థిక పురోగతి తదితర అంశాలపై చర్చించనున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను ఏకతాటిపైకి తీసుకొచ్చి, వారి ఆలోచనలు, అనుభవాలను పంచుకోవడంతో పాటు సమాజ అభ్యున్నతికి కార్యాచరణ రూపొందించడం ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. హిందూ విలువలు, సంస్కృతి, ఆధ్యాత్మికతను పరిరక్షిస్తూ సమాజ పురోగతికి దోహదపడే మార్గాలపై ఇందులో చర్చించనున్నారు.
ఏడు అంశాలపై ప్రత్యేక సదస్సులు
ఈ కాంగ్రెస్లో ఏడు అంశాలపై సమాంతర సమావేశాలు నిర్వహించనున్నారు. వాటిలో ఆర్థికం, విద్య, మీడియా తదితర రంగాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
– ప్రపంచ హిందూ ఆర్థిక వేదిక: పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ఆర్థిక నిపుణుల మధ్య సహకారం, వ్యాపార అవకాశాల అభివృద్ధిపై చర్చ.
– హిందూ విద్యా సదస్సు: నాణ్యమైన విద్య, విద్యారంగంలో నాయకత్వం, భారతీయ నాగరికతకు సంబంధించిన అంశాలపై చర్చ.
– హిందూ మీడియా సదస్సు: పాత్రికేయ రంగంలోని సవాళ్లు, సమాజానికి సమాచారాన్ని చేరవేసే విధానాలపై చర్చ.
మిగిలిన సమావేశాల్లోనూ వివిధ రంగాల అభివృద్ధి, నాయకత్వం, సామాజిక భాగస్వామ్యం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ప్రపంచ హిందూ కాంగ్రెస్ను నాలుగేళ్లకోసారి నిర్వహిస్తున్నారు. గతంలో 2014లో న్యూఢిల్లీ, 2018లో చికాగో, 2023లో బ్యాంకాక్ నగరాల్లో ఈ సదస్సులు జరిగాయి.
ఐక్యత, సామూహిక సంకల్పానికి వేదిక
ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సంస్థలు, నాయకులు, కార్యకర్తల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం, ఆలోచనలను కార్యాచరణలోకి తీసుకురావడం ఈ సదస్సు లక్ష్యమని నిర్వాహకులు పేర్కొంటున్నారు. హిందూ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించడంతో పాటు, విద్య, ఆర్థికం, సంస్కృతి, మీడియా వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
సామూహిక సంకల్పం, పరస్పర సహకారం, సమాజ సేవ అనే ప్రధాన భావనలతో జరగనున్న ప్రపంచ హిందూ కాంగ్రెస్–2026పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సంస్థలు, ప్రతినిధుల్లో ఆసక్తి నెలకొంది.





