News

హిందూ ఆలయంపై కాల్పులు జరిగినా- రెట్టింపు ఉత్సాహంతో చికాగోలో నవరాత్రి వేడుకలు!

4views

ఇటీవల అమెరికాలో హిందూ దేవాలయంపై తుపాకీ కాల్పుల కుట్ర తృటిలో తప్పిన వేళ చికాగోలో హిందూ సమాజం ఒక్కసారిగా అప్రమత్తమైంది. సరిగ్గా దాడి చేసే సమయానికి నిందితుడి తుపాకీ మొరాయించడంతో పెను ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనతో అక్కడి ప్రవాస భారతీయులు, హిందూ సమాజం ఒక్కసారిగా ఉలిక్కిపడినా రెట్టింపు ఆత్మవిశ్వాసంతో పండుగ వేడుకల్లో పాల్గొంటున్నారు.

అసలేం జరిగింది?
నవరాత్రి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా అక్టోబర్ 11న అమెరికాలోని హిందూ సమాజం భక్తులందరూ ఇల్లినాయిస్‌ రాష్ట్రంలోని అరోరాలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి (బాలాజీ) ఆలయాలనికి తరలివచ్చారు. ఆ సమయంలో అలెగ్జాండ్రోస్ పాపొరాకిస్ అనే యువకుడు ఆలయం పార్కింగ్ స్థలానికి తుపాకీతో చేరుకున్నాడు. అయితే, కాల్పులు జరపడానికి ప్రయత్నించిన సమయంలో అతని దగ్గర ఉన్న రైఫిల్ జామ్ (పనిచేయకపోవడం) అవడంతో, కాల్పులు జరపకుండా అక్కడి నుంచి పారిపోయాడు.

విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు నిందుతుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి ఇల్లినాయిస్​లోని పాలటైన్‌లో నిందితుడి ఇంటి సమీపంలో అతడిని గుర్తించి అరెస్టు చేశారు. భారతీయులను చంపాలనే అతడి ప్లాన్​ గురించి పాపొరికాస్​తో పనిచేసే సహోద్యోగి విషయాన్ని ముందుగానే అధికారులకు తెలియజేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితుడిపై ఉగ్రవాద బెదిరింపులు, అక్రమ ఆయుధాల కలిగి ఉండటం వంటి తీవ్రమైన అభియోగాలు నమోదు చేశారు. పాపొరాకిస్‌ను అరెస్టు చేసిన తర్వాత, అతని ఇంటి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, దక్షిణాసియా వారిని కించపరిచేలా రాసి ఉన్న నోట్స్​ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పాపొరాకిస్ రాసిన ఒక సుదీర్ఘమైన లేఖలో అతను సామూహిక హత్యల గురించి ఊహించుకుంటూ, వీలైనంత ఎక్కువ మంది శ్వేతజాతేతరులను చంపాలనే తన కోరికను వ్యక్తం చేశాడని అధికారులు చెప్పారు.

‘పండుగ వేళ ఇలా జరగడం మమ్మల్ని కలిచివేసింది’
సరిగ్గా నవరాత్రి, దసరా, దీపావళి వంటి వరుస పండుగల సీజన్ ప్రారంభమయ్యే సమయంలో ఈ ఘటన జరగడం దక్షిణాసియా సమాజాన్ని కలవరపాటుకు గురిచేసింది. గత ఏడాది కాలంగా అమెరికాలో దక్షిణాసియా వాసులు, హిందువులపై వ్యతిరేకత పెరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

‘ఆ దుర్గామాత ఆశీస్సుల వల్లే తుపాకీ పనిచేయలేదు’
అయితే, ఘటనా సమయంలో నిందితుడి వద్ద తుపాకి పేలకపోవడంతో అక్కడున్నవారంతా ఊపిరిపీల్చుకున్నారు. నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న వేళ ఆ దుర్గామాత ఆశీస్సుల వల్లే దుండగుడి తుపాకీ పనిచేయలేదని, ఆ తల్లే భక్తులందరి ప్రాణాలు కాపాడిందని అక్కడి హిందువులు బలంగా విశ్వసిస్తున్నారు. ” ‘భగవంతుడు రక్షించే వారిని ఎవరూ చంపలేరు’ అని హిందీలో ఒక సామెత ఉంది. ఇది సరిగ్గా నవరాత్రి పండుగ సమయంలో జరిగింది. ఆ సమయంలో దుర్గాదేవే స్వయంగా ఆలయంలో ఉన్న భక్తులందరినీ కాపాడిందని మేమంతా నమ్ముతున్నాం. ప్రస్తుతం ప్రజలు మరింత అప్రమత్తంగా ఉన్నారు, ఆలయాల వద్ద ప్రైవేట్ సెక్యూరిటీని కూడా పెంచుకుంటున్నారు” అని ఫ్రీలాన్స్ కాలమిస్ట్ అవతన్స్ కుమార్ పేర్కొన్నారు.

మరోవైపు, ఈ ఘటన అనంతరం చికాగోలోని పలు హిందూ ఆలయాలు, ప్రవాస భారతీయ సంఘాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. భయాందోళనలు ఉన్నప్పటికీ, తమ సంస్కృతి, సంప్రదాయాలను వీడకుండా అదనపు సెక్యూరిటీ మధ్య వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ ఘటనను ‘విద్వేషపూరిత నేరం’గా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రవాస భారతీయ నేతలు, అమెరికా కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.