News

శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా వైభవంగా స్వర్ణ రథోత్సవం

8views

శ్రీశైలం: నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీభ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివార్ల స్వర్ణరథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆరుద్రోత్సవంలో భాగంగా జరిగిన ఈ వేడుకకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

ఉత్సవాల్లో భాగంగా వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను సర్వాంగసుందరంగా అలంకరించి స్వర్ణరథంపై ఆశీనులను చేశారు. ఆలయ అర్చకులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక సంకల్పాన్ని పఠించారు.

దేశం శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని, అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థించారు. పాడిపంటలతో దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని, అకాల మరణాలు, అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు సంభవించకుండా లోకమంతా సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని వేడుకున్నారు.

అనంతరం భక్తుల హరహర మహాదేవ నామస్మరణ, వేదమంత్రాల నడుమ స్వర్ణరథోత్సవం ప్రారంభమైంది. గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు, తిరిగి నందిమండపం నుంచి గంగాధర మండపం వరకు రథోత్సవాన్ని నిర్వహించారు. స్వర్ణరథంపై కొలువుదీరిన స్వామి, అమ్మవార్లు ఆలయ ప్రధాన వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.

సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా రథోత్సవంలో పలు కళాబృందాలు కోలాటాలు, తప్పెట చిందులు, జానపద కళారూపాలు, సంప్రదాయ నృత్యాలతో అలరించాయి. స్వామి, అమ్మవార్ల స్వర్ణరథోత్సవాన్ని తిలకించేందుకు స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యులు, అర్చకస్వాములు, దేవస్థానం అధికారులు, సిబ్బంది, స్థానికులు, భక్తులు పాల్గొన్నారు.