ప్రపంచ వేదికపై పట్నాలోని ‘బిహార్ మ్యూజియం’ అదరగొట్టింది. జర్మనీకి చెందిన స్వతంత్ర ట్రావెల్ గైడ్ ‘వర్త్ ఏ జర్నీ’ విడుదల చేసిన 2026 సంవత్సరపు ప్రపంచంలోని 100 ఉత్తమ మ్యూజియంల జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఆసియాకు చెందిన మ్యూజియాల్లో టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఈ క్రమంలో అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న ‘మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్’ (10), పారిస్‌లోని ప్రతిష్ఠాత్మక మ్యూజియం లూవ్రే (31)ను వెనక్కి నెట్టింది. మాజీ సీఎం నీతీశ్ కుమార్ కలల ప్రాజెక్ట్ అయిన ‘బిహార్ మ్యూజియం’ ప్రపంచ స్థాయిలో సాధించిన ఘనత పట్ల జేడీయూ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
13 ఎకరాల విస్తీర్ణంలో
2015లో పట్నా నగరంలో ఈ మ్యూజియం ప్రారంభమైంది. దీని విస్తీర్ణం 13 ఎకరాలకు పైమాటే. ఈ మ్యూజియంను జపాన్‌కు చెందిన ప్రఖ్యాత ప్రిట్జ్కర్ ప్రైజ్ గ్రహీత ఫుమిహికో మాకి, మహారాష్ట్రలోని ముంబయికి చెందిన ఒపాలిస్ ఆర్కిటెక్ట్స్ భాగస్వామ్యంతో అద్భుతంగా రూపొందించారు. ఈ మ్యూజియంలో పురాతన నాగరికతల కాలం నుంచి క్రీ.శకం 1764 వరకు సంబంధించిన చారిత్రక కళాఖండాలు ఉన్నాయి. అంతేకాకుండా సంప్రదాయ, జానపద, సమకాలీన కళారూపాలు కూడా ఇక్కడున్నాయి. జంతువుల కథలు, జానపద కళ, సంస్కృతి, విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలతో కూడిన పిల్లల గ్యాలరీ కూడా ఉంది.
బిహార్ ఫుడ్ దొరికే రెస్టారెంట్
అంతేకాకుండా ఈ మ్యూజియంలో ఓ రెస్టారెంట్ ఉంది. అందులో మధ్యాహ్న భోజనం దొరుకుతుంది. అక్కడ పసందైన బిహారీ వంటకాలను ఆస్వాదించవచ్చు. బిహార్ మ్యూజియం మంగళవారం- ఆదివారం వరకు (ప్రతిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు) సందర్శకుల కోసం తెరిచి ఉంటుంది. ఈ మ్యూజియంను సందర్శించడానికి పెద్దలకు ఎంట్రీ టికెట్ ధర రూ.100 కాగా, పిల్లలకు రూ.50.
‘ఈ ఘనత 14 కోట్ల మంది బిహారీలకు గర్వకారణం’
తమ పార్టీ చీఫ్, మాజీ సీఎం నీతీశ్ కుమార్ కలల ప్రాజెక్ట్ బిహార్ మ్యూజియానికి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడంపై జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేశ్ సింగ్ కుష్వాహా సంతోషం వ్యక్తం చేశారు. ఇది 14 కోట్ల మంది బిహారీకు గర్వకారణమని అన్నారు. ఆధునికతతో రాష్ట్ర చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించాలనే నీతీశ్ కుమార్ దూరదృష్టి, నిబద్ధత ఫలితమే ఈ బిహార్ మ్యూజియమని కొనియాడారు. ఈ ప్రపంచ స్థాయి ప్రాజెక్ట్ కోసం బిహార్ ప్రభుత్వం 2011 జులైలో కెనడియన్ కన్సల్టెన్సీ లార్డ్ కల్చరల్ రిసోర్సెస్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుందని అన్నారు. ఈ మ్యూజియానికి నీతీశ్ కుమార్ 2013లో శంకుస్థాపన చేశారని వెల్లడించారు.
“బిహార్ మ్యూజియంను పట్నా మ్యూజియంలను కలిపే ఒక భారీ భూగర్భ సొరంగం నిర్మాణం జరుగుతోంది. ఈ సొరంగం పొడవు 1.5 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్ట్‌కు 2026 మార్చి 3న అప్పటి బిహార్ సీఎం నీతీశ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఆధునిక వాస్తు శిల్పం, ఇక్కడ వేలాది ఏళ్లుగా భద్రపరిచిన చారిత్రక వారసత్వమే ఈ మ్యూజియం ప్రత్యేకత అని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్న ప్రపంచ ప్రసిద్ధ దీదార్‌గంజ్ యక్షి విగ్రహం నుంచి మౌర్యులు, గుప్తులు, పాల వంశాల కాలం నాటి కళాఖండాలు చూపరులను ఆకట్టుకుంటాయి. అంతేకాకుండా అశోకుడు, బౌద్ధ, జైన సంప్రదాయాలు, షేర్సా సూరి, మొఘల్ కాలానికి సంబంధించిన చారిత్రక సంపద బిహార్ గొప్ప చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. పట్నా స్కూల్ ఆఫ్ పెయింటింగ్ కళాఖండాలు, కంచు విగ్రహాలు, టెర్రకోట కళాఖండాలు, అరుదైన నాణేల సేకరణ వంటివి దేశ, విదేశాల నుంచి మ్యాజియానికి వచ్చే పర్యటకులను ఆకర్షిస్తాయి. ఈ ప్రత్యేకతలన్నీ కలిసి ఈ మ్యూజియాన్ని అంతర్జాతీయ స్థాయిలో గొప్పగా మార్చాయి.” అని కుష్వాహా పేర్కొన్నారు.
విపక్షాల విమర్శలకు కౌంటర్
అబద్ధాలు, భ్రమల ఆధారంగా బిహార్ ప్రతిష్టను దిగజార్చాలని చూస్తున్న విపక్షాలకు అంతర్జాతీయ స్థాయిలో బిహార్ మ్యూజియంకు దక్కిన ఈ గౌరవం తగిన సమాధానమని జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేశ్ సింగ్ కుష్వాహా అభిప్రాయపడ్డారు. నీతీశ్ కుమార్ దూరదృష్టితో కూడిన ఆలోచనల ఫలితంగా నేడు బిహార్ చారిత్రక, సాంస్కృతిక వారసత్వం అంతర్జాతీయ గుర్తింపును పొందుతోందన్నారు.



