News

ఆదివాసీ ఆహార వైభవం

7views

ఆదివాసీలు తమ సంప్రదాయాలను కాపాడుకుంటూ విద్య, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నారు. సిరికొండ మండలం నారాయణ్‌పూర్‌లో ‘ఆర్పీజీ’అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివాసీ ఆహార వైభవం కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గ్రామస్థులు కలెక్టర్‌కు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆర్పీజీ సంస్థ ద్వారా రైతులు తయారు చేసిన జీవామృతం, ఘన జీవామృతం, బయోచార్, నిమ్మాస్త్రం, అగ్ని అస్త్రం, దశపర్ణి కషాయం, బీజామృతం, వావిలాకు కషాయం, వర్మీ కంపోస్టు, ఆదివాసీ మహిళలు తయారు చేసిన 120 రకాల వంటకాలు, పప్పు దినుసులు, పూర్వ కాలంలో ఉన్నటువంటి వ్యవసాయ పరికరాలను ప్రదర్శించారు. వాటిని ఆసక్తిగా తిలకించి, రుచి చూశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. రైతులు ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలని సూచించారు. ఇప్పపువ్వు లడ్డూలు, మోదుగతో తయారు చేసిన ఇస్తార్లు, చిన్న వ్యాపారం చేసుకోవడానికి మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి సందీప్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారిణి మిల్కా, వ్యవసాయ శాస్త్రవేత్తలు రాజశేఖర్, శ్రీధర్ చౌహాన్, ఆర్పీజీ సంస్థ సభ్యులు రవి కుమార్, శ్రీకర్ రెడ్డి, తహసీల్దార్ ఉపేందర్, ఎంపీడీవో రఘువీర్ రెడ్డి, ఎంపీవో సంతోశ్, ఏవో శ్రద్ధరాణి, సర్పంచి చిక్రం విమలబాయి, సిరిచెల్మ ఎఫ్ఆర్వో శ్రీనివాస్, జిల్లా సార్ మేడి అమృత్ రావు, నారాయణ్ పూర్ సార్మేడి సుంగు పాల్గొన్నారు.