News

భగవద్గీత శ్లోకాల పారాయణ పోటీల్లో రాణిస్తున్న ముస్లిం విద్యార్థిని నుస్త్రత్‌

4views

బనగానపల్లె: భారతీయ సనాతన ధర్మానికి, సంస్కృతికి ప్రతీకగా నిలిచే భగవద్గీత శ్లోకాలను శ్రావ్యంగా పారాయణం చేస్తూ నంద్యాల జిల్లా బనగానపల్లెకు చెందిన ముస్లిం విద్యార్థిని నుస్త్రత్‌ విశేష ప్రతిభ కనబరిచారు. భగవద్గీత శ్లోకాల పారాయణ పోటీలో ప్రథమ బహుమతి సాధించి రూ.లక్ష నగదు పురస్కారాన్ని అందుకున్నారు.

బనగానపల్లె జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న నుస్త్రత్‌.. పట్టణంలోని ఎన్జీవో కాలనీకి చెందిన గడ్డం మహబూబ్‌బాషా, దిల్‌షాద్‌బేగం దంపతుల కుమార్తె. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పాఠశాల తెలుగు ఉపాధ్యాయురాలు గౌరి ఆధ్వర్యంలో భగవద్గీత శ్లోకాల పారాయణంలో శిక్షణ పొందారు.

పాఠశాలకు చెందిన 22 మంది విద్యార్థినులు ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకు ప్రతిరోజూ సాయంత్రం సుమారు గంటపాటు భగవద్గీత శ్లోకాల పారాయణంలో శిక్షణ పొందారు. అనంతరం జూలై 19న ప్రొద్దుటూరులో ఇస్కాన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన దక్షిణ భారత స్థాయి భగవద్గీత పోటీల్లో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి సుమారు వెయ్యి మంది విద్యార్థులు తొలి దశ పోటీల్లో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. రెండు దశల్లో జరిగిన పోటీల్లో తొలి దశ అనంతరం 113 మంది విద్యార్థులు రెండో దశకు ఎంపికయ్యారు. వీరిలో బనగానపల్లె జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన 22 మంది విద్యార్థినులు ఉండటం విశేషం.

శ్లోకాలను రాగయుక్తంగా పారాయణం
ఆగస్టు 2న జరిగిన రెండో దశ పోటీల్లో భగవద్గీతలోని 108 శ్లోకాలలో తొలి 54 శ్లోకాల ఆధారంగా విద్యార్థుల ప్రతిభను పరీక్షించారు. ఈ సందర్భంగా నుస్త్రత్‌, శృతి అడిగిన శ్లోకాలను ఎలాంటి తడబాటు లేకుండా దోషరహితంగా, రాగయుక్తంగా, భావయుక్తంగా, శ్రావ్యంగా పారాయణం చేశారు. నుస్త్రత్‌ ప్రథమ బహుమతిగా రూ.లక్ష నగదు పురస్కారం సాధించగా, శృతి ద్వితీయ బహుమతిని అందుకున్నారు.

సనాతన సంస్కృతిపై ఆసక్తికి ప్రశంసలు
ముస్లిం కుటుంబానికి చెందిన విద్యార్థిని నుస్త్రత్‌ భగవద్గీత శ్లోకాలను నేర్చుకుని రాష్ట్రాల స్థాయి పోటీలో ప్రథమ బహుమతి సాధించడం బనగానపల్లె ప్రజల దృష్టిని ఆకర్షించింది. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక సాహిత్యంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందించడంలో పాఠశాల ఉపాధ్యాయుల కృషిని పలువురు అభినందిస్తున్నారు.

నుస్త్రత్‌ చదువులోనూ ప్రతిభ కనబరుస్తున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రసాదరావు తెలిపారు. గత ఏడాది నిర్వహించిన ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షలో ఎంపికై నాలుగేళ్లపాటు కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతనం పొందేందుకు అర్హత సాధించినట్లు చెప్పారు.