News

​పర్యావరణ పరిరక్షణ మన ఇంటి నుంచే ప్రారంభం కావాలి…..

37views

పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఆ మార్పు ముందుగా మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే పిలుపునిచ్చారు. లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్, అటవీ, పర్యావరణ శాఖ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 1 నుండి 7 వరకు “ఒక వారం.. ఏడు ఆచరణలు.. ఒకే భూగోళం” అనే నినాదంతో నిర్వహించిన ‘బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు–2026’ ముగింపు కార్యక్రమం శనివారం మంగళగిరి ఎకో పార్కులో ఘనంగా నిర్వహించారు.

​ముఖ్య అతిథిగా విచ్చేసిన పర్యావరణ,అటవీ శాఖ, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే మాట్లాడుతూ.. బ్రిక్స్ దేశాల భాగస్వామ్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి పౌరుడూ ఒక వాలంటీర్‌గా మారాలన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఇంట్లోనూ ఘన వ్యర్థాలను వేరు చేయడం (సెగ్రిగేషన్) అలవాటు చేసుకోవాలని సూచించారు. ఆ మార్పును ముందుగా మన కుటుంబం, స్నేహితులకు విస్తరింపజేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయన వివరించారు.

​పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 660 మండలాల్లో ‘స్వచ్ఛ రథాలు’ ఏర్పాటు చేసి పొడి వ్యర్థాల సేకరణ చేపడుతున్నామని తెలిపారు.ప్రతి కిలో ప్లాస్టిక్ వ్యర్థాలకు 20 రూపాయల విలువైన నిత్యావసరాలను ‘గ్రీన్ షాప్స్’ ద్వారా అందించే విధానాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ​’వేస్ట్ టు వెల్త్’ విధానంలో భాగంగా ఘన వ్యర్థాల నుంచి వర్మీ కంపోస్ట్ (వానపాముల ఎరువు) తయారు చేసి మార్క్‌ఫెడ్ ద్వారా రైతులకు అందిస్తున్నామని వివరించారు. విద్యార్థుల్లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు ఏపీపీసీబీ ద్వారా పాఠశాలలకు స్టీల్ వాటర్ బాటిళ్లు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.