
కురుక్షేత్ర (హర్యానా): భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించిన ధర్మం, న్యాయం, నైతిక విలువలను న్యాయమూర్తులు తమ జీవితాల్లో ఆచరిస్తే అది మొత్తం న్యాయవ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతుందని అమరావతి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి అన్నారు. న్యాయవ్యవస్థపై ప్రజలకు మరింత విశ్వాసం కలగాలంటే గీతా బోధనలు న్యాయమూర్తుల నడవడిలో ప్రతిబింబించాలని పేర్కొన్నారు.
హర్యానాలోని కురుక్షేత్రలో తొమ్మిది రోజులుగా వైభవంగా సాగిన సామవేదం షణ్ముఖ శర్మ ‘మహాభారతంలో శ్రీకృష్ణ పాత్ర’ ప్రవచన కార్యక్రమం ముగింపు సభలో ఆమె ప్రసంగించారు. జూనియర్ న్యాయమూర్తులతో నిర్వహించే సమావేశాల్లోనూ భగవద్గీత బోధనల ప్రాధాన్యతను వివరిస్తుంటానని తెలిపారు. న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించే ప్రతి ఒక్కరికీ న్యాయవ్యవస్థపై నమ్మకం కలగాలంటే న్యాయమూర్తులు ధర్మబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. తన తల్లి నేర్పిన జీవిత విలువలు తన వ్యక్తిత్వంపై చూపిన ప్రభావాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
భగవంతుని నామస్మరణతో భక్తి పెంపొందుతుంది
ఈ కార్యక్రమానికి మరో అతిథిగా హాజరైన అమరావతి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ రావు మాట్లాడుతూ, ఇటువంటి ఆధ్యాత్మిక ప్రవచనాల ముఖ్య ఉద్దేశం భగవంతుని గాథలను వినడం ద్వారా భక్తిభావాన్ని పెంపొందించుకోవడమేనని అన్నారు. దైవ నామస్మరణ ద్వారా భగవంతుడిని మన హృదయంలో నిలుపుకోవచ్చని వివరించారు. ఈ సందర్భంగా తెలుగులో రాగయుక్తంగా పద్యం ఆలపించి సభికులను ఆకట్టుకున్నారు.
మహాభారతం మానవ జీవితానికి దిక్సూచి
ప్రవచనకర్త డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ మాట్లాడుతూ మహాభారతం మనిషి ఎలా జీవించాలో నేర్పించే గొప్ప జీవన మార్గదర్శకమని వివరించారు. అందులోని పాత్రలు, సంఘటనలు, ధర్మసందేహాలు ప్రతి ఒక్కరికీ జీవిత పాఠాలను అందిస్తాయని పేర్కొన్నారు.
సీనియర్ పాత్రికేయులు జి. వల్లీశ్వర్ మాట్లాడుతూ 2015లో సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనాలు తన ఆలోచనా విధానాన్ని, జీవనశైలిని ప్రభావితం చేశాయని అనుభవాలను పంచుకున్నారు. వారణాసిలోని తారకరామ ఆంధ్రాశ్రమం అధ్యక్షుడు సుందర శాస్త్రి తదితరులు కూడా ప్రసంగించారు.
కురుక్షేత్రలో భక్తిభావంతో తొమ్మిది రోజుల ప్రవచనాలు
తొమ్మిది రోజుల పాటు సాగిన ప్రవచనాలకు వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి కూడా తెలుగు భక్తులు తరలివచ్చారు. దాదాపు 400 మంది ప్రత్యక్షంగా ప్రవచనాలను విన్నారు. గీతా జ్ఞాన్ సంస్థాన్ ప్రాంగణంలో అక్టోబర్ 24 నుంచి గురుకృప చారిటబుల్ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు.
తన ప్రవచనాలను వినేందుకు సుదూర ప్రాంతాల నుంచి వందలాది మంది తెలుగు వారు తరలిరావడం శ్రీకృష్ణుడి పట్ల హిందూ సమాజానికి ఉన్న భక్తి, విశ్వాసాలకు నిదర్శనమని సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. గీతా బోధ జరిగిన పవిత్ర కురుక్షేత్రలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కృషి చేసిన గోవిందవజ్ఘల కామేశ్వరరావు, తూములూరి బాలాజీ బృందాన్ని అభినందించారు.
తొమ్మిది రోజుల పాటు మహాభారత ప్రవచనామృతంలో మునిగితేలిన భక్తులు ముగింపు సందర్భంగా సామవేదం షణ్ముఖ శర్మకు పాదపూజ నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు.




