News

ఆ గ్రామంలో వారం ముందుగానే దీపావళి వేడుకలు

24views

దేశమంతా దీపావళి వెలుగులు నింపేందుకు సిద్ధమవుతున్న వేళ, ఛత్తీస్‌గఢ్‌లోని ఒక గ్రామంలో మాత్రం వారం రోజుల ముందుగానే సంబరాలు మొదలయ్యాయి. అక్కడ దీపావళి ఒక్కటే కాదు హోలీ, హరియాలి, పోలా వంటి పండుగలను కూడా వాటి అసలైన తిథుల (తేదీలు) కంటే సరిగ్గా 7 రోజుల ముందుగానే జరుపుకుంటారు. తరతరాలుగా వందల ఏళ్లుగా వస్తున్న ఈ ప్రత్యేక, వింతైన ఆచారం- గ్రామ దేవతపై ఉన్న భక్తి, విశ్వాసాలతో ముడిపడి ఉంది. గ్రామ దేవత సిర్దార్ దేవ్‌ ఆజ్ఞ ప్రకారమే ఇక్కడ పండగలను ముందే జరుపుకుంటారని స్థానికుల నమ్మకం. ధమ్‌తరీ జిల్లాలోని సెమ్రా గ్రామంలో ఈ ప్రత్యేక సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.

ఈ ఏడాది కూడా సెమ్రా గ్రామంలో దీపావళి పండగను వారం రోజుల ముందుగానే మంగళవారం రోజు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. పూర్వీకుల ఆచారాన్ని పాటిస్తూ లక్ష్మీ దేవి, గోవర్ధన పూజలను ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇళ్లు, వాకిళ్లను దీపాల వెలుగులతో అలంకరించారు. ఇంటి ముంగిళ్లలో రంగురంగుల రంగవల్లులు వేసి, గ్రామం మొత్తాన్ని పండగ వాతావరణంతో నింపేశారు. ఈ వింత, విశిష్ట సంప్రదాయాన్ని చూడటానికి, వేడుకల్లో భాగస్వామ్యం కావడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో జనం సెమ్రా గ్రామానికి తరలివచ్చారు.

శతాబ్దాల ఆచారం వెనుక అసలు కారణం ఇదేనా?
గ్రామస్థుల కథనం ప్రకారం- గతంలో సెమ్రా గ్రామం చిన్న చిన్న ఇళ్లతో చుట్టూ దట్టమైన అడవులతో ఉండేది. అడవి జంతువుల సంచారం కారణంగా ప్రజలు తరచుగా ఇబ్బందుల్ని ఎదుర్కొనేవారు. ఆ సమయంలో వేట కోసం వచ్చిన సిర్దార్ అనే వ్యక్తి గ్రామస్థులకు అండగా నిలిచాడు. అడవి జంతువుల బారి నుంచి ప్రజల్ని, ఊరిని కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయాడు. అలా గ్రామస్థుల దృష్టిలో ఆయన ప్రాణాలు అర్పించిన వ్యక్తిగా, తమకు రక్షకుడిగా నిలిచిపోయాడు. కాలక్రమంలో ఆయనను గ్రామ దేవతగా భావించి సిర్దార్ దేవ్‌గా పూజించడం ప్రారంభించారని స్థానికులు నమ్ముతుంటారు.

ఇలానే ఒకసారి గ్రామ పెద్దకు సిర్దార్ దేవ్ కలలో ప్రత్యక్షమై- గ్రామంలో జరిగే అన్ని పండగలను సాధారణ తేదీల కంటే 7 రోజుల ముందుగానే జరుపుకోవాలని సూచించారట. అలా చేయకుంటే గ్రామానికి మరిన్ని కష్టాలు వస్తాయని హెచ్చరించినట్లు చెబుతారు. అయినా జనం తొలుత దీని గురించి పెద్దగా ఆలోచించలేదు. దానిని పట్టించుకోలేదు. ఇతర ప్రాంతాల మాదిరిగానే సంప్రదాయంగా వచ్చే తేదీల్లోనే పండగలు జరుపుకున్నారు. ఆ తర్వాత గ్రామంలో చాలా మందికి అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి. కరవు కూడా వచ్చింది. ఇలా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నట్లు చెబుతుంటారు. దీంతో అప్పటి నుంచి గ్రామ పెద్దకు కలలో వచ్చిన ఆదేశాన్ని పాటించాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి ప్రతి పండగకు ముందు సిర్దార్ దేవ్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించి, తర్వాతే వేడుకలు నిర్వహించడం ఒక సంప్రదాయంగా మారింది.

గ్రామ సర్పంచ్ ఛబిలేష్ కుమార్ సిన్హా ఈ ప్రత్యేక సంప్రదాయంపై మాట్లాడారు. సిర్దార్ దేవ్‌పై అపారమైన భక్తితో గ్రామంలో నాలుగు పండగలను వారం రోజుల ముందుగానే జరుపుకుంటామని తెలిపారు. పండగలకు 15- 20 రోజుల ముందుగానే ఏర్పాట్లు ప్రారంభిస్తామని వివరించారు. దీపావళి సమయంలో చుట్టుపక్కల 15-20 గ్రామాల నుంచి ప్రజలు సెమ్రాకు వస్తారని చెప్పారు. 2 రోజుల పాటు గ్రామం మొత్తం జాతరను తలపిస్తుందని, ఊరి జనాభా కంటే కూడా ఇతర ఊళ్ల నుంచి వచ్చే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. కాలక్రమంలో ఎన్నో సంప్రదాయాలు కనుమరుగవుతున్నా సెమ్రా గ్రామ ప్రజలు మాత్రం తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలను ఇప్పటికీ భక్తిశ్రద్ధలతో పాటిస్తుండటంతో ప్రత్యేక గుర్తింపు పొందింది.