News

భీమన్న రచనలు సామాజిక వికాసానికి దోహదం

5views

రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శనివారం మహాకవి, పద్మభూషణ్ బోయి భీమన్న జయంతి వేడుకలు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో అత్యంత వైభవంగా, ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కందుల దుర్గేష్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశలు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కలెక్టరేట్‌కు విచ్చేసిన మంత్రివర్యులకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమ ప్రారంభంలో కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోయి భీమన్న జీవిత ఛాయాచిత్రమాలికను మంత్రి దుర్గేష్ పరిశీలించారు. అనంతరం వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి, బోయి భీమన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

వేడుకలో భాగంగా లో గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత, సాహితీవేత్త భూసురపల్లి వెంకటేశ్వర్లుని ‘బోయి భీమన్న అవార్డు-2026’తో పురస్కరించారు. ఆయనకు జ్ఞాపిక, శాలువాతో పాటు రూ. 2,00,000 నగదు పారితోషికం చెక్కును మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా అందజేసి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ..* “మహాకవి బోయి భీమన్న భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన రచనల ద్వారా అమరుడయ్యారు, ప్రాతఃస్మరణీయుడిగా నిలిచారు. ఆయన కవితాధోరణికి, ఉదాత్త భావజాలానికి నిజమైన అర్థాంగి, సర్వస్వం ఆయన సతీమణి హైమావతి. భీమన్న రచనలు సమాజంలో ఎంతో స్పృహను, చైతన్యాన్ని రగిలించాయి.. నేటి తరానికి మహామహుల రచనలను అందించి సామాజిక వికాసానికి దోహదపడతాం ప్రస్తుతం తెలంగాణలో ఉన్న భీమన్న కళాపీఠాన్ని ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరంలో ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి తీసుకురావడానికి తగిన చర్యలు తీసుకుంటాం. సాంస్కృతిక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ తో మాట్లాడి అర్హులైన ప్రతి కళాకారునికి గుర్తింపు కార్డులు ఇప్పిస్తాం అన్నారు.. ఈ సందర్భంగా భాషా సాంస్కృతిక శాఖ పనితీరును శ్రీకృష్ణదేవరాయల భువనవిజయంలోని అష్టదిగ్గజాలతో పోల్చవచ్చని మంత్రి దుర్గేష్ చమత్కరించారు.

బోయి భీమన్న సతీమణి బోయి హైమావతి మాట్లాడుతూ.. భీమన్న జయంతి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి, మంత్రి దుర్గేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంత్రి దుర్గేష్ ప్రసంగ శైలిని, వాగ్దాటిని ఈ సందర్భంగా ఆమె ప్రశంసించారు.రాష్ట్ర నాటక రంగ అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ బోయి భీమన్న గొప్ప సామాజిక రచయిత అని, సమాజ శ్రేయస్సు కోరిన ఆయన సాహిత్యాన్ని ప్రతి ఒక్కరూ చదివి ఆవగాహన చేసుకోవాలని సూచించారు.

అవార్డు గ్రహీత భూసురపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..విశ్వనాథ సత్యనారాయణ, గుర్రం జాషువా, బోయి భీమన్నలను త్రిమూర్తులుగా, మహాకవులుగా కీర్తించారు. ఈ ముగ్గురూ పద్మ పురస్కారాలు పొందారని గుర్తుచేశారు. కవితా ప్రపంచాన్ని ఏలిన భీమన్న పేరిట తనకు అవార్డు రావడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. భీమన్న సతీమణి హైమావతి కృషి వల్లే ఆయనకు ఈ గౌరవం ప్రతీ ఏటా దక్కుతోందని పేర్కొన్నారు.