
రాష్ట్రంలో ఆధ్యాత్మికతను మరింత పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో శ్రీ లక్ష్మీ నరసింహ కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. సుమారు 700 సంవత్సరాల చరిత్ర కలిగిన మైలవరం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. స్వామివారి ఆశీస్సులతో కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
రాష్ట్రంలోని ఆలయాలను అభివృద్ధి చేయడంతోపాటు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రాష్ట్రంలోని అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కామన్ వెల్త్ ఫండ్ కీలకంగా ఉందన్నారు. దేవాలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని తిరిగి ఆలయాల పునర్నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నామని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా పుణ్యక్షేత్రాల్లో సుమారు 700 ఆలయాల పునర్నిర్మాణానికి కోట్లాది రూపాయల నిధులు కేటాయించి టెండర్లు పిలిచామని మంత్రి వెల్లడించారు. ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాల కోసం గతంలో ఇస్తున్న రూ.2 వేల మొత్తాన్ని కూటమి ప్రభుత్వం రూ.10 వేలకు పెంచిందన్నారు.
ఏజెన్సీ, గిరిజన, అటవీ ప్రాంతాల్లోనూ ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ప్రతి ప్రాంతంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.




