News

కలెక్టరేట్‌లో మతపరమైన కార్యకలాపాలకు స్థానం లేదు

2views

ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ కలెక్టరేట్ ప్రాంగణంలోని మసీదు కూల్చివేత వ్యవహారం చర్చకు దారితీసింది. ప్రభుత్వ స్థలంలో ఉన్న మసీదును కోర్టు ఆదేశాల మేరకు అధికారులు తొలగించగా, ఈ చర్యను సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సహారన్‌పూర్‌లో పర్యటించిన మహామండలేశ్వర్ స్వామి ప్రబోధానంద గిరి మాట్లాడుతూ, మసీదు తొలగింపును వ్యతిరేకిస్తున్న వారు పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ వెళ్లవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ప్రయాణ ఖర్చులు భరించలేని వారికి తానే ఖర్చులు అందిస్తానని కూడా అన్నారు.

సహారన్‌పూర్ చేరుకున్న ప్రబోధానంద గిరి ఎస్ఎస్పీ కార్యాలయానికి వెళ్లి పోలీసు ఉన్నతాధికారులను కలిశారు. అనంతరం మాట్లాడుతూ.. కలెక్టరేట్ ప్రాంగణం పూర్తిగా పరిపాలనా కార్యకలాపాలకు సంబంధించిన ప్రాంతమని, అక్కడ మతపరమైన కార్యకలాపాలకు స్థానం ఉండకూడదని పేర్కొన్నారు.మసీదుపై చర్యలు తీసుకున్న పోలీసులు, ఇతర అధికారులను ఆయన అభినందించారు. కోర్టు ఆదేశాల మేరకే మసీదును తొలగించారని స్పష్టం చేశారు.

మసీదు వక్ఫ్ బోర్డుకు చెందినదనే వాదనలపైనా ఆయన స్పందించారు. మసీదుకు సంబంధించి హక్కులను నిరూపించే పత్రాలు ఉంటే వాటిని కోర్టులో సమర్పించాలని సవాల్ చేశారు.

అయితే ఈ వ్యవహారంపై న్యాయపరమైన వివాదం ఇంకా కొనసాగుతోంది. జూలై 16న సహారన్‌పూర్ సిటీ మేజిస్ట్రేట్ మసీదును తొలగించాలని ఆదేశించడంతో పాటు రూ.6.41 కోట్ల జరిమానా విధించారు.

ఈ ఉత్తర్వును జిల్లా కోర్టులో సవాలు చేయగా.. సెప్టెంబర్ 2న జిల్లా కోర్టు సిటీ మేజిస్ట్రేట్ ఆదేశాలను సమర్థించింది. అనంతరం సెప్టెంబర్ 5న అధికారులు మసీదును కూల్చివేశారు. అయితే ఈ నిర్ణయాలను సవాలు చేస్తూ సెప్టెంబర్ 9న అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మసీదు కూల్చివేత వ్యవహారం మరింత న్యాయపరమైన ప్రాధాన్యం సంతరించుకుంది.

మసీదు తొలగింపును వ్యతిరేకిస్తున్న వారిని ఉద్దేశించి ప్రబోధానంద గిరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారాయి. మసీదు తొలగింపుపై అభ్యంతరం ఉన్నవారు పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ వెళ్లవచ్చని ఆయన అన్నారు. వెళ్లేందుకు ఆర్థిక స్థోమత లేని వారికి తానే ప్రయాణ ఖర్చులు భరిస్తానని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా.. మసీదు కూల్చివేత అనంతరం అక్కడ సుమారు 20 అడుగుల లోతైన పాత బావి వెలుగులోకి రావడం మరోసారి చర్చకు దారితీసింది. ఈ బావికి చారిత్రక లేదా మతపరమైన ప్రాధాన్యం ఉందా? అనే అంశంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరగాల్సి ఉందని ప్రబోధానంద గిరి అన్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ విషయంలో ఎలాంటి తుది నిర్ణయానికి రావద్దని సూచించారు.