News

భారతీయులపై ట్రంప్ బృందం జాత్యహంకార వ్యాఖ్యలా ? వివాదాస్పద పోస్టర్‌పై తీవ్ర విమర్శలు

3views

అమెరికాలో వలసల నియంత్రణకు సంబంధించిన ప్రచారంలో భారతీయులను లక్ష్యంగా చేసుకున్నట్లుగా కనిపిస్తున్న ఓ పోస్టర్‌ వివాదానికి దారితీసింది. అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ విభాగం ఎక్స్‌ వేదికగా షేర్ చేసిన ఈ పోస్టర్‌పై హిందూ అమెరికన్లు, సిక్కు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇది వివక్షాపూరితంగా, జాత్యహంకార ధోరణిని ప్రతిబింబించేలా ఉందని వారు ఆరోపిస్తున్నారు.

హాలీవుడ్‌ చిత్రం ‘ట్రాన్స్‌ఫార్మర్స్‌’లోని ఓ దృశ్యాన్ని పోలిన చిత్రాన్ని ఉపయోగించి ఈ పోస్టర్‌ను రూపొందించారు. అందులో తలపాగా ధరించిన వ్యక్తి ఎదురుగా ఓ రోబో నిల్చొని ఉన్నట్లు చూపించారు. ఆ వ్యక్తిని ఉద్దేశించి..“మిస్టర్ సింగ్‌.. మా రోడ్లను వదిలిపెట్టండి. మీకు వాహనాలు నడపడం రాదు”** అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యను పొందుపరిచారు.

అదే పోస్టర్‌పై “మీ అంతట మీరుగా దేశాన్ని వీడండి.. లేకపోతే మేం గుర్తిస్తాం” అనే హెచ్చరికను కూడా పేర్కొన్నారు. అక్రమ వలసదారులపై చర్యలకు సంబంధించిన ప్రచారంలో భాగంగా ఈ సందేశాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.

అయితే పోస్టర్‌లో ఉపయోగించిన ‘సింగ్‌’అనే పేరుతో పాటు తలపాగా ధరించిన వ్యక్తి చిత్రాన్ని ఉపయోగించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో ట్రక్కు డ్రైవర్లలో సిక్కు సమాజానికి చెందిన వారు, ‘సింగ్‌’ పేరును ఉపయోగించే వారు గణనీయ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో ఈ ప్రచారం ఒక నిర్దిష్ట మత, జాతి సమూహాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోందని విమర్శలు వస్తున్నాయి.

వలసల నియంత్రణ చర్యలను అక్రమంగా అమెరికాలో ఉంటున్న వ్యక్తులకే పరిమితం చేయాల్సి ఉండగా.. ఒక నిర్దిష్ట సమాజాన్ని సూచించేలా పదాలు, చిత్రాలను ఉపయోగించడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ పోస్టర్‌ ద్వారా భారతీయులు, ముఖ్యంగా సిక్కు సమాజంపై ప్రతికూల భావనలను ప్రోత్సహించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

“ఇది వివక్షాపూరితమైన పోస్టు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలి” అని పలువురు హిందూ అమెరికన్లు, సిక్కు సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం.

అమెరికా ప్రభుత్వ వలస విధానాలపై ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సమయంలో ఈ వివాదాస్పద పోస్టర్‌ కొత్త చర్చకు తెరతీసింది. అధికారిక ప్రచారాల్లో ఏదైనా నిర్దిష్ట మతం లేదా జాతికి చెందిన ప్రజలను అవమానించేలా వ్యాఖ్యలు, దృశ్యాలు ఉండకూడదని విమర్శకులు పేర్కొంటున్నారు.