రోడ్లపై తిరిగే నిస్సహాయ గోవులు కారణంగా కొన్నిసార్లు యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ఈ ప్రమాదాల్లో కొన్నిసార్లు వాహనదారులు ప్రాణాలు కోల్పోతుంటారు. అలాగే గోవులు కూడా తీవ్రంగా గాయపడటం లేదా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంటుంది. అయితే ఇలా ప్రమాదాల్లో గాయపడిన, నిస్సహాయ, అనారోగ్యంతో బాధపడుతున్న గోమాతలను సంరక్షించేందుకు నడుం బిగించారు పంజాబ్‌లోని మోగాకు చెందిన మనోజ్ అరోరా. గత 26 ఏళ్లుగా ఆయన మూగజీవాల సంరక్షణ కోసం పాటుపడుతున్నారు. ఈ క్రమంలో మానవత్వం, కరుణ, నిస్వార్థ సేవకు నిదర్శనంగా నిలుస్తున్నారు.
జీవితంలో ఒక భాగంగా గోసేవ
నిస్సహాయ, అనారోగ్య, గాయపడిన గోవులకు సేవ, చికిత్స అందించడంలో మనోజ్ అరోరా నిరంతరం నిమగ్నమై ఉన్నారు. ఈ పని ఆయనకు కేవలం ఒక సామాజిక బాధ్యత మాత్రమే కాదు. ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. గాయపడిన గోవు గురించి సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకోవడం, దానిని సురక్షితంగా తరలించడం, చికిత్స చేయించడం, అది కోలుకునే వరకు దానిని సంరక్షించడం వంటి సేవలను మనోజ్ అరోరా, ఆయన బృందం చాలా కాలంగా చేస్తోంది. దీంతో వీరిపై జంతు ప్రేమికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
గాయపడిన, నిస్సహాయ, అనారోగ్య గోమాతలకు తన సేవల గురించి మనోజ్ అరోరా ‘ఈటీవీ భారత్’కు వివరించారు. తన తండ్రి గోవులకు, పక్షులకు సేవ చేసేవారని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి నుంచి స్ఫూర్తి పొంది తాను క్రమంగా గోశాలకు వెళ్లి సేవ చేయడం ప్రారంభించానని తెలిపారు. గోశాలకు వెళ్లడం మొదలుపెట్టిన తర్వాత ప్రజల నుంచి తనకు ఫోన్ కాల్స్ రావడం ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. ఎక్కడో ఒకచోట అనారోగ్యంతో ఉన్న లేదా రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆవు ఉందని ప్రజలు తనకు సమాచారం ఇస్తారని వెల్లడించారు.
స్థలం లేక అవస్థలు
అయితే గాయపడిన గోవులను ప్రమాద స్థలం నుంచి తీసుకురావడం మనోజ్ అరోరాకు మొదట్లో పెద్ద సవాల్‌గా మారింది. గోమాతలను తరలించేందుకు ఆయన దగ్గర సరైన పరికరాలు లేవు. గాయపడిన గోవులను ఉంచడానికి ప్రత్యేక స్థలమూ లేదు. రోడ్డుపై గాయాలతో గోమాత బాధపడటం చూసినప్పుడు కొన్నిసార్లు ఆయన నిస్సహాయతకు గురై తీవ్రంగా బాధపడేవారు. ఈ బాధే ఆయనను ఒక పెద్ద అడుగు వేసేలా ప్రేరేపించింది. ఆ తర్వాత మనోజ్ అరోరా వివిధ గోశాలలను సంప్రదించి గాయపడిన, అనారోగ్యంతో ఉన్న ఆవుల కోసం కొంత స్థలం కేటాయించమని విజ్ఞప్తి చేశారు. గోశాలల సహాయంతో ఆయన క్రమంగా గాయపడిన ఆవులను అక్కడికి తీసుకువెళ్లి చికిత్స చేయించడం ప్రారంభించారు. కాలక్రమేణా మనోజ్ ఆరోరా సేవను చూసి ఒక భక్తుడు కొంత స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. అక్కడే మనోజ్ గోశాల ఏర్పాటు చేశారు.
“ప్రజల సహకారంతో గాయపడిన, అనారోగ్యంతో ఉన్న ఆవులను తరలించడానికి ఒక ‘హైడ్రాలిక్ గో అంబులెన్స్’ సిద్ధం చేశాం. ఈ అంబులెన్స్ అందుబాటులోకి రావడంతో గాయపడిన ఆవులను సురక్షితంగా పైకి లేపి, చికిత్స కోసం తీసుకురావడం సాధ్యమైంది. ఇప్పటివరకు సుమారు 20-25 వేల ఆవులు, నందులకు (ఎద్దులకు) చికిత్స అందించాను. ఇందులో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన, వివిధ వ్యాధులతో బాధపడుతున్న గోమాతలు ఉన్నాయి. గోశాల నిర్వహణకు నెలకు మొత్తం రెండున్నర నుంచి మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ” అని మనోజ్ అరోరా స్పష్టం చేశారు.
‘అలాంటి సంఘటనలు నన్ను తీవ్రంగా కలచివేస్తాయి’
గాయపడిన ఆవులకు సేవ చేయడంలో తాను స్వయంగా ముందుంటానని మనోజ్ అరోరా చెప్పారు. ప్రమాదాల్లో కాళ్లు విరిగిపోయిన లేదా సాధారణ ఆవుల్లా నడవలేని గోమాతల కోసం గోశాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వివరించారు. ఇతర జంతువుల వల్ల వాటికి మరింత గాయం కాకుండా ఉండేందుకు, వాటిని ప్రత్యేకంగా ఉంచుతామని వెల్లడించారు. గోమాతల పట్ల ఏ విధంగానూ క్రూరంగా ప్రవర్తించడం సరికాదని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రజలు కోపంతో ఆవులు, ఎద్దులను పదునైన వస్తువులతో గాయపరుస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి సంఘటనలు తనను తీవ్రంగా కలచివేస్తాయని పేర్కొన్నారు.
సాదాసీదా జీవితం గడుపుతూ
మనోజ్ అరోరా వ్యక్తిగత జీవితం చాలా సాదాసీదాగా ఉంటుంది. ఆయన ప్యాకేజింగ్‌కు ఉపయోగించే ఫాయిల్ పేపర్‌ను విక్రయించే చిన్న వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు గోసేవలో మనోజ్‌కు పూర్తి మద్దతు ఇస్తున్నారు. రోడ్డుపై గాయపడిన ఆవు గురించి సమాచారం అందిన వెంటనే మనోజ్, ఆయన బృందం అక్కడ ఠక్కున వాలిపోతుంది. గత 26 ఏళ్లుగా గోసేవలో ఇదే ఉత్సాహాన్ని, నిబద్ధతను మనోజ్ కొనసాగిస్తున్నారు.





