News

కదలని ఖడే హనుమాన్‌.. తరలింపునకు అధికారుల ప్రయత్నాలు విఫలం

0views

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో 170 ఏళ్ల నాటి ఖడే హనుమాన్‌ ఆలయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రహదారి విస్తరణలో భాగంగా ఆలయాన్ని మరో ప్రాంతానికి తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా.. అక్కడి సుమారు 8 అడుగుల ఎత్తైన హనుమంతుడి విగ్రహం మాత్రం కదలడం లేదు. భారీ యంత్రాలను ఉపయోగించినప్పటికీ విగ్రహాన్ని తొలగించలేకపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు.

హనుమంతుడి విగ్రహాన్ని తరలించేందుకు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ నిర్మాణంలో కొంత భాగాన్ని తొలగించిన తర్వాత విగ్రహాన్ని బయటకు తీసేందుకు మూడు బృందాలు దాదాపు 48 గంటలపాటు ప్రయత్నించినట్లు స్థానికులు చెబుతున్నారు. పనులు ప్రారంభమై నాలుగు రోజులు దాటినా విగ్రహాన్ని కదిలించడంలో మాత్రం అధికారులు విజయవంతం కాలేదు. భారీ యంత్రాలతో పలు రకాలుగా ప్రయత్నించినా విగ్రహం ఏమాత్రం కదలకపోవడం స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది. కొందరు భక్తులు దీనిని హనుమంతుడి మహిమగా, స్వామివారి సంకేతంగా భావిస్తున్నారు.

2028లో ఉజ్జయినిలో సింహస్థ మహాకుంభమేళా జరగనుంది. మార్చి 27 నుంచి మే 27 వరకు జరిగే ఈ మహా వేడుకను 12 ఏళ్లకోసారి నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో నగరంలో మౌలిక వసతుల అభివృద్ధి, రహదారుల విస్తరణ పనులు చేపడుతున్నారు. ఈ పనుల్లో భాగంగానే ఖడే హనుమాన్‌ ఆలయాన్ని తరలించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే పురాతన ఆలయంతోపాటు హనుమంతుడి విగ్రహాన్ని సురక్షితంగా తరలించడం అధికారులకు సవాలుగా మారింది.

విగ్రహం కదలకపోవడంపై ప్రస్తుతం వివిధ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్నెట్‌లోని కొన్ని నివేదికల ప్రకారం.. విగ్రహం పురాతన భూగర్భ పునాదిలో లోతుగా అమర్చబడి ఉండొచ్చని తెలుస్తోంది. పాత రాళ్ల నిర్మాణాలతో విగ్రహం అనుసంధానమై ఉండే అవకాశం ఉందని ఆ నివేదికలు పేర్కొంటున్నాయి. అధిక బలాన్ని ప్రయోగించి విగ్రహాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తే పురాతన నిర్మాణానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని భావిస్తున్న అధికారులు.. భారీ తవ్వకం యంత్రాల వినియోగాన్ని నిలిపివేసినట్లు సమాచారం.

ప్రస్తుతం ఆధునిక భూగర్భ స్కానింగ్‌ సాంకేతికతను ఉపయోగించి విగ్రహం కింద ఉన్న పునాది నిర్మాణాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. విగ్రహం ఎంత లోతు వరకు పునాదిలో ఉందో, దాని చుట్టూ ఉన్న పురాతన నిర్మాణం ఎలా ఉందో తెలుసుకున్న తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.

మరోవైపు, విగ్రహాన్ని తరలించే సమయంలో సుమారు 50 కోతులు అక్కడికి చేరుకున్నాయని కొందరు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ఘటన కూడా భక్తుల్లో ఆసక్తిని కలిగించింది. ఆలయ పూజారి మహేశ్‌ బైరాగి స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. విగ్రహం కదలకపోవడాన్ని భక్తులు దేవుడి సంకేతంగా భావిస్తున్నారని తెలిపారు. ఒకవేళ విగ్రహాన్ని తరలించడం తప్పనిసరి అయితే.. ప్రస్తుతం ఉన్న రూపం, స్థితి దెబ్బతినకుండా అత్యంత జాగ్రత్తగా తరలించాలని, అనంతరం అదే విధంగా పునఃప్రతిష్ఠ చేయాలని అధికారులను కోరారు.

ఖడే హనుమాన్‌ ఆలయం, అందులోని విగ్రహం 170 ఏళ్లకంటే పురాతనమైనవని స్థానికులు చెబుతున్నారు. అందుకే అభివృద్ధి పనులతోపాటు ఆలయ ప్రాచీనత, భక్తుల విశ్వాసాలకు ఎలాంటి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. భక్తులకు ఇది హనుమంతుడి మహిమగా కనిపిస్తుండగా.. అధికారులు మాత్రం పురాతన పునాది నిర్మాణమే విగ్రహం కదలకపోవడానికి కారణమా అనే కోణంలో సాంకేతికంగా పరిశీలిస్తున్నారు. స్కానింగ్‌ అనంతరం వచ్చే నివేదిక ఆధారంగా విగ్రహం తరలింపుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.