ArticlesProgramms

భంగారం బిడాయి.. కష్టాలను తీసుకెళ్లే దేవుడి పల్లకి

4views

డప్పుల మోత.. భక్తుల ప్రార్థనలు.. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకి.. ఊరి పొలిమేర దాటిన తర్వాత పూజా సామగ్రిని అక్కడే విడిచిపెట్టడం.. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పుర్‌లో తరతరాలుగా కొనసాగుతున్న ఓ విశిష్ట సంప్రదాయం ఇది. అదే ‘భంగారం బిడాయి’. ప్రజల అనారోగ్యాలు, బాధలు, కష్టాలు, దుఃఖాలను భంగారం దేవుడు తన వెంట తీసుకెళ్లి.. ఆ ప్రాంతానికి శాంతి, సౌభాగ్యం, మంచి పంటలను ప్రసాదిస్తాడని స్థానికుల విశ్వాసం.

ఐదు రోజులపాటు ప్రత్యేక పూజలు
రక్షాబంధన్‌ తర్వాత శ్రావణ మాసం ముగింపు, భాద్రపద మాసం ప్రారంభ సమయంలో ఈ సంప్రదాయాన్ని ఐదు రోజులపాటు నిర్వహిస్తారు. నారాయణ్‌పుర్‌లోని స్థానిక మాత మావ్లీ ఆలయంలో పవిత్ర దారం కట్టడంతో భంగారం బిడాయి వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా భక్తులు పసుపు, నూనెతోపాటు తమ మొక్కులు, కానుకలను దేవుడికి సమర్పిస్తారు.

రాయి కింద భద్రపరిచి..
భక్తులు సమర్పించిన పూజా సామగ్రి, మొక్కులు, కానుకలను ఆలయ ప్రాంగణంలోని ఓ రాయి కింద భద్రపరుస్తారు. ఐదు రోజుల ప్రత్యేక పూజలు పూర్తైన అనంతరం వాటిని బయటకు తీసి.. ప్రత్యేకంగా సిద్ధం చేసిన పల్లకిలో ఉంచుతారు.

ఊరి పొలిమేర దాటిన తర్వాత..
‘సారా’గా పిలిచే పూజారులు ఈ పల్లకిని డప్పుల మోత, భక్తుల ప్రార్థనల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్తారు. పట్టణ సరిహద్దులు దాటిన తర్వాత ఊరి పొలిమేర వద్ద పూజా సామగ్రిని విడిచిపెడతారు. దీంతో ప్రజల కష్టాలు, అనారోగ్యాలు, దుఃఖాలు కూడా తమ ప్రాంతాన్ని వీడి వెళ్లిపోతాయని స్థానికులు నమ్ముతారు.

ఈ సంప్రదాయం తమ ప్రాంతానికి శాంతి, సౌభాగ్యం, ఆరోగ్యం, మంచి పంటలను ప్రసాదిస్తుందనే విశ్వాసంతో ప్రతి ఏటా భక్తులు భంగారం బిడాయి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తుంటారు. దేవ్‌ కమిటీ ఉపాధ్యక్షుడు అర్జున్‌ దేవాంగన్‌ ఈ సంప్రదాయానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.