
గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో శుక్రవారం ఉదయం గోపూజ మహోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర గోశాలలోని శ్రీ వేణుగోపాలస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య గోమాత, దూడలకు నూతన వస్త్రాలు, పుష్పమాలలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోమాతకు భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలు చేసిన ఈవో.. అనంతరం హారతి సమర్పించారు.
గోమాత పాలను స్వయంగా పితికిన టీటీడీ ఈవో
గోపూజలో భాగంగా టీటీడీ ఈవో రవిచంద్ర గోమాత పాలను స్వయంగా పితికారు. పవిత్రంగా భావించే ఆ పాలను ఆలయ అర్చకులకు అందజేశారు. అనంతరం ఆ పాలను శ్రీ వేణుగోపాలస్వామివారికి అభిషేకం చేయడం విశేషంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోమాతను దర్శించుకుని పూజలు చేశారు.
7 కోట్ల సార్లు ‘ఓం నమో వేంకటేశాయ’ జప సమర్పణ
అనంతరం ‘ఓం నమో వేంకటేశాయ’ మహామంత్రాన్ని 7 కోట్ల సార్లు జపించిన జప పుస్తకాలను స్వామివారికి సమర్పించే కార్యక్రమాన్ని టీటీడీ ఈవో సందర్శించారు.ఈ సందర్భంగా నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో ఆయన పాల్గొని శ్రీవారి కృపను కోరారు. జప సమర్పణ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత భక్తిమయం చేసింది.
గోమాతలో సమస్త దేవతా స్వరూపాలను దర్శించే విశ్వాసం
ఈ సందర్భంగా టీటీడీ ఈవో మాట్లాడుతూ.. గోమాత పూజ భారతీయ సంస్కృతి, సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన సంప్రదాయమని పేర్కొన్నారు. గోమాతలో సమస్త దేవతా స్వరూపాలను దర్శించే గొప్ప ఆధ్యాత్మిక విశ్వాసం మన సంప్రదాయంలో ఉందన్నారు. గోసంరక్షణ, గోసేవకు టీటీడీ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలను మరింత అభివృద్ధి చేసి, గోసేవ కార్యక్రమాలను విస్తృతంగా కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
గోకులాష్టమి సందర్భంగా గోశాలలో నిర్వహించిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తిగీతాలు, సంప్రదాయ కార్యక్రమాలతో గోశాల ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గోకులాష్టమి సందర్భంగా గోమాతకు నిర్వహించిన ఈ ప్రత్యేక పూజలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించాయి.





