News

స్వయంసేవకులను లక్ష్యం వైపు నడించే మాధ్యమం సంఘ గీత్ : పరాగ్ అభ్యంకర్

30views

భువనేశ్వర్ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్ది సందర్భంగా భువనేశ్వర్ మహా నగర్ లోని ‘షట్ కంఠే శతాబ్ది రా స్వర’ పేరుతో అపూర్వ సంగీత కార్యక్రమాన్ని నిర్వహించింది.ఈ కార్యక్రమంలో 105 మంది ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులు పాల్గొని, వివిధ భారతీయ భాషలలో 100కు పైగా దేశభక్తి మరియు సంఘ్ గీతాలను ఆలపించారు. దేశభక్తి, దేశం పట్ల అంకితభావం, సాంస్కృతిక ఐక్యత మరియు సేవా భావనలను వ్యక్తం చేయడానికి సంగీతాన్ని ఒక మాధ్యమంగా ఉపయోగించడం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం.

భారతదేశ భాషా మరియు సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా, ఈ కార్యక్రమంలో ఒడియా, హిందీ, సంస్కృతం, బెంగాలీ, అస్సామీ, తెలుగు, మలయాళం మరియు పంజాబీ భాషలలోని గీత్ లను ఆలాపించారు. ఇది కేవలం ఒక సంగీత ప్రదర్శన మాత్రమే కాదని, సంగీత శక్తి ద్వారా దేశం పట్ల అంకితభావం మరియు సేవా భావనను బలోపేతం చేసే ప్రయత్నమని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఇక.. ఆరెస్సెస్ అఖిల భారత సేవా ప్రముఖ్ పరాగ్ అభ్యంకర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సంగీతం అనేది కేవలం రాగం, లయ కలయిక మాత్రమే కాదని, భావోద్వేగాలను మేల్కొలిపే, ప్రజలను లక్ష్యం వైపు ప్రేరేపించే శక్తిమంతమైన మాధ్యమం అని తెలిపారు.RSS శాఖలలో సంప్రదాయబద్ధంగా పాడే పాటలు కేవలం వినోదం లేదా విశ్రాంతి కోసం ఉద్దేశించినవి కావని, ఆ పాటల ద్వారా వ్యక్తమయ్యే భావాలు మరియు భావోద్వేగాలు స్వయంసేవకులలో దేశం కోసం పనిచేయాలనే స్ఫూర్తిని నింపడం మరియు మాతృభూమి పట్ల వారి అంకితభావనను మరింత దృఢతరం చేయడం లక్ష్యంగా కలిగి వుంటాయని వివరించారు.

భారతమాత ఆరాధన అనేది ఆర్‌ఎస్‌ఎస్ శాఖల కార్యకలాపాలలో అంతర్భాగమని, ఆ పాటల ద్వారా వ్యక్తమయ్యే భావాలను ఆకళింపు చేసుకోవడం ద్వారా స్వయంసేవకులు దేశం పట్ల తమ అంకితభావాన్ని మరింత దృఢం చేసుకుంటారని పరాగ్ అభ్యంకర్ పేర్కొన్నారు. దేశ సేవలో ప్రజలు తమవంతు కృషి చేసేలా వారిని ప్రేరేపించడంలో పాటలు శక్తివంతమైన మాధ్యమంగా ఉపయోగపడతాయని ఆయన అన్నారు.ప్రజలకు ‘రాష్ట్ర సేవా’ సందేశాన్ని చేరవేయడంలోనూ, వారి హృదయాలలో అంకితభావనను పెంపొందించడంలోనూ సంగీతం కీలక పాత్ర పోషించగలదని ఆయన నొక్కిచెప్పారు.

భువనేశ్వర్ స్వయంసేవకులు నిర్వహించిన ఈ కార్యక్రమం ఓ వినూత్న ప్రయోగం అని అన్నారు.స్వయంసేవకుల కృషిని అభినందిస్తూ, సంగీతం ద్వారా ‘రాష్ట్ర సేవా’ భావనను బలోపేతం చేసే కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని అభ్యంకర్ అన్నారు. మహాప్రభు లింగరాజుతో అనుబంధం కలిగిన ఈ పవిత్ర క్షేత్రంలో ఈ కార్యక్రమం నిర్వహించడం దీనికి ప్రత్యేక ప్రాముఖ్యతను చేకూర్చిందని ఆయన పేర్కొన్నారు.

కేవలం ఒడిశా భాషలోని సంఘ్ గీత్ లనే ఆలాపించడం కాకుండా బెంగాలీ, అస్సామీ, తెలుగు, మలయాథం, పంజాబీ, హిందీ, సంస్కృత గీత్ లను కూడా ఆలాపించారు.ఈ గీతాలు వివిధ సంగీత లయలు మరియు శైలులలో రూపొందించబడ్డాయి. భువనేశ్వర్ మహానగర్ బౌద్ధిక్ ప్రముఖ్ అమరేంద్ర సాహు, తన సహచర కళాకారులతో కలిసి, ఈ ప్రదర్శనల రూపకల్పన మరియు సంగీతపరమైన తయారీలో కీలక పాత్ర పోషించారు.సుమారు 100 మంది స్వయంసేవకులు సమిష్టిగా ‘వందేమాతరం’ ఆలపించడంతో కార్యక్రమం ప్రారంభమై, సంగీత కార్యక్రమాలకు ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని కల్పించింది. ఆ తర్వాత, స్వయంసేవకులు మరియు సంఘం బాధ్యులు దేశభక్తి గీతాలు మరియు సంఘ్ గీతాలను ఆలపించారు.