News

బంగ్లాదేశ్‌ పౌరుడి పాస్‌పోర్టు రెన్యువల్‌కు రూ.5 లక్షలు డిమాండ్‌.. ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌

21views
మాచర్ల: బంగ్లాదేశ్‌ పౌరుడి పాస్‌పోర్టు పునరుద్ధరణకు రూ.5 లక్షలు డిమాండ్‌ చేశారన్న ఆరోపణలపై ఇద్దరు కానిస్టేబుళ్లను అధికారులు సస్పెండ్‌ చేశారు. పల్నాడు జిల్లా మాచర్లలో సుమారు మూడు దశాబ్దాలుగా ఆయుర్వేద వైద్యుడిగా కొనసాగుతున్న ఎంకే రాయ్‌ అసలు బంగ్లాదేశ్‌ పౌరుడని వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

ఎంకే రాయ్‌ 1992లో బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. అనంతరం పలు ప్రాంతాల్లో సంచరించిన ఆయన చివరకు మాచర్లలో స్థిరపడ్డారు. ఆయుర్వేద వైద్యం చేస్తూ స్థానికంగా పరిచయాలు పెంచుకున్నారు. ఆర్థికంగా కూడా స్థిరపడిన రాయ్‌.. తాను పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతా నుంచి వచ్చినట్లు స్థానికులకు చెప్పేవారని తెలుస్తోంది.

ఈ క్రమంలో ఎన్నికల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్‌)లో భాగంగా అధికారులు ఓటరు వివరాల పరిశీలన చేపట్టారు. స్థానికతను నిర్ధారించేందుకు పూర్వీకుల చిరునామా తదితర వివరాలపై ఆరా తీస్తుండగా రాయ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. జిల్లా ఎస్పీ కూడా ఆయనను పిలిపించి వివరాలు విచారించినట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో రాయ్‌ పాస్‌పోర్టు రెన్యువల్‌ అంశం తెరపైకి వచ్చింది. నరసరావుపేట స్పెషల్‌ బ్రాంచ్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు ఆయనను విచారించగా.. ఆయన బంగ్లాదేశ్‌కు చెందిన హిందువని గుర్తించినట్లు సమాచారం. అనంతరం రాయ్‌ను నరసరావుపేటకు పిలిపించి పాస్‌పోర్టు పునరుద్ధరణ విషయంలో బేరసారాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి.

ఈ వ్యవహారంలో రాయ్‌ నుంచి ఇద్దరు కానిస్టేబుళ్లు భారీగా ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ముడుపుల పంపకాల్లో ఇద్దరు కానిస్టేబుళ్లకు, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌కు చెందిన మరో కానిస్టేబుల్‌కు మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. అనంతరం ఆ కానిస్టేబుల్‌ రాయ్‌ను మరింత డబ్బు డిమాండ్‌ చేసినట్లు సమాచారం. అందుకు రాయ్‌ అంగీకరించకపోవడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.

మరోవైపు, మాచర్లలో మూడు దశాబ్దాలకు పైగా నివసించిన రాయ్‌ స్థానికంగా పలు గుర్తింపు పత్రాలను కూడా పొందినట్లు సమాచారం. ఆధార్‌, పాన్‌ కార్డు, పాస్‌పోర్టు, బ్యాంకు ఖాతాలు తదితరాలను భారత్‌లోనే పొందినట్లు తెలుస్తోంది.

మాచర్లకు తొలుత ఒంటరిగా వచ్చిన రాయ్‌ అనంతరం కుటుంబాన్ని ఇక్కడే ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్‌కు చెందిన యువతిని వివాహం చేసుకుని భారత్‌కు తీసుకొచ్చారని, ఏడాది క్రితం తన అత్తను కూడా బంగ్లాదేశ్‌ నుంచి ఇక్కడికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రాయ్‌ భారత్‌లోకి ప్రవేశించిన విధానం, పొందిన గుర్తింపు పత్రాలు, పాస్‌పోర్టు జారీకి సంబంధించిన అంశాలతో పాటు కానిస్టేబుళ్లపై వచ్చిన ముడుపుల ఆరోపణలపై కూడా విచారణ జరుగుతున్నట్లు సమాచారం.