News

వార‌ణాసిలో ఉధృతంగా గంగా న‌ది ప్ర‌వాహం.. 84 ఘాట్లు మూసివేత

31views

వార‌ణాసిలో గంగా న‌ది ఉదృతంగా ప్ర‌వ‌హిస్తున్న‌ది. ఎగువ‌న కురుస్తున్న వ‌ర్షాల‌తో గంగా న‌దిలో ప్ర‌వాహం గ‌ణ‌నీయంగా పెరిగింది. దీంతో కాశీలోని 84 ప్ర‌ఖ్యాత స్నాన ఘాట్ల‌ను మూసివేశారు. ఆ ఘాట్ల‌న్నీ పూర్తిగా మునిగిపోయాయి. సుమారు 6500 మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. అధికారులు ఫ్ల‌డ్ రిలీఫ్ క్యాంపుల‌ను ఏర్పాటు చేశారు. భ‌ద్ర‌త దృష్ట్యా ప‌బ్లిక్ బోట్ల‌ను బ్యాన్ చేశారు. గంగా, యమునా న‌ది ప‌రివాహ‌క ప్రాంతాల్లో కురుస్తున్న వ‌ర్షాల‌తో నీటి ప్ర‌వాహం పెరిగిన‌ట్లు భావిస్తున్నారు.

ఇటీవ‌ల కురిసిన తుఫాన్ వ‌ర్షాల వ‌ల్ల స్థానిక న‌దీ వ్య‌వ‌స్థ‌లు దెబ్బ‌తిన్న‌ట్లు స్థానిక ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు చెబుతున్నారు. గంగా న‌ది ఉదృతం కావ‌డంతో.. దాని ఉప‌న‌ది వ‌రుణ న‌దిలోనూ నీటి ప్ర‌వాహం పెరిగింది. దీంతో ఆ న‌ది స‌మీపంలో ఉన్న లోత‌ట్టు ప్రాంతాల‌న్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి. పురాత‌న వాట‌ర్ పైప్‌లైన్లు, డ్రైనేజీ వ్య‌వ‌స్థ తాజా వ‌ర్షాల‌ను ఎదుర్కోలేక‌పోతున్నాయ‌ని వార‌ణాసి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ పేర్కొన్న‌ది.

న‌దిలో నీటి వేగం పెర‌గ‌డంతో.. ఘాట్ల వ‌ద్ద ఉన్న మెట్లు మునిగిపోయాయి. దీంతో అక్క‌డ న‌డ‌క కూడా ఇబ్బందిగా మారింది. ఇక క‌మ‌ర్షియ‌ల్‌, రిక్రియేష‌న‌ల్ బోటు ఆప‌రేష‌న్స్ కూడా ర‌ద్దు చేశారు. ద‌శాశ్వ‌మేధ ఘాట్‌లో జ‌ర‌గాల్సిన గంగా హార‌తిని మ‌రో చోట నిర్వ‌హించ‌నున్నారు. మ‌ణిక‌ర్ణిక‌, హ‌రిశ్చంద్ర ఘాట్ల వ‌ద్ద శ‌వాల ద‌హ‌న స్థ‌లాన్ని మార్చి, కాంక్రీట్ ఫ్లాట్‌ఫాంల‌పై నిర్వ‌హిస్తున్నారు. న‌దికి వెళ్లే ఎంట్రీ పాయింట్ల‌ను టూరిస్టుల కోసం మూసివేశారు.