News

ఆధ్యాత్మికత పరిఢవిల్లేలా దేవాలయాల నిర్మాణం

8views

రాష్ట్రవ్యాప్తంగా 5 వేల దేవాలయాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ, దేవాదాయశాఖ అధికారులను ఆదేశించారు. ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదిత స్థలాలను త్వరితగతిన ఖరారు చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. హైందవ ధర్మాన్ని, ఆధ్యాత్మికతను ప్రోత్సహించేలా టీటీడీ కార్యక్రమాలను విస్తృతం చేయాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల నిర్మాణం, టీటీడీ ఆధ్వర్యంలోని ధార్మిక, విద్య, వైద్య సేవలపై క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 161 నియోజకవర్గాల నుంచి 4,192 ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు అందాయని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర సీఎంకు వివరించారు. ఇప్పటికే 967 ఆలయాల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. మూడు కేటగిరీలుగా ఆలయాలను నిర్మించేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలు, మత్స్యకార ప్రాంతాలు, బలహీన వర్గాల కాలనీలతో పాటు సాధారణ ప్రాంతాల్లోనూ ఆలయాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు. ఆలయాల నిర్మాణానికి సంబంధించిన స్థలాలను త్వరగా ఖరారు చేస్తే పనులను మరింత వేగంగా చేపట్టవచ్చని అధికారులు సీఎంకు తెలిపారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చే నిధులను కూడా ఆలయాల నిర్మాణం, ధార్మిక కార్యక్రమాలకు వినియోగించాలని సీఎం సూచించారు. వేంకటేశ్వర స్వామిపై ప్రజల్లో ప్రగాఢమైన విశ్వాసం, నమ్మకం ఉందని చంద్రబాబు అన్నారు. 11.8 లక్షల మంది శ్రీవారి సేవకులు ఉన్నారని, వారి సేవలను కొత్తగా నిర్మించే ఆలయాల్లోనూ వినియోగించుకోవాలని సూచించారు. ఆలయాల నిర్మాణం, నిర్వహణలో భక్తుల భాగస్వామ్యాన్ని పెంచాలని చెప్పారు. బోర్డు సభ్యులు, భక్తులు, శ్రీవారి సేవకులతో ఎగ్జిక్యూటివ్ కమిటీలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల రాజధానుల్లోనూ శ్రీవారి ఆలయాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. ఇందుకోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలని చెప్పారు. మారిషస్ వంటి దేశాలు కూడా శ్రీవారి ఆలయాల నిర్మాణాన్ని కోరుకుంటున్నాయని, భవిష్యత్తులో శ్రీవారి ఆలయాలు హిందువులకు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మారేలా కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు.

అర్చకులకు శిక్షణ.. విగ్రహాల తయారీ కేంద్రాలు
ఆలయాలకు అవసరమైన అర్చకులను సిద్ధం చేసేందుకు ప్రత్యేక కోర్సులు నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు. ఆలయాల్లో విగ్రహాల ఏర్పాటు, అర్చకుల శిక్షణకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న వెయ్యి పాత ఆలయాలను కూడా పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో శివాలయాలు, శక్తి పీఠాల అభివృద్ధిపైనా దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలోని ఆలయాల సమగ్ర వివరాలు డిజిటలైజ్ చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. దేవాదాయశాఖ పరిధిలోని 28 వేల ఆలయాలు, టీటీడీ నిర్వహిస్తున్న 65 ఆలయాలతో పాటు కొత్తగా నిర్మించే 5 వేల ఆలయాల నిర్వహణకు ముందస్తు ప్రణాళిక అవసరమని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ నియంత్రణలో ఆలయాల నిర్వహణను సమర్ధంగా చేపట్టాలని సూచించారు. టీటీడీ చేపడుతున్న అన్నదానం, ప్రాణదానం, శ్రీవారి సేవకుల సేవలు, ఆలయాల నిర్మాణం వంటి కార్యక్రమాలను హిందూ ధర్మ ప్రచారంతో అనుసంధానిస్తూ ముందుకు తీసుకెళ్లాలని సీఎం పేర్కొన్నారు. టీటీడీలో అన్నదానం కార్యక్రమం గొప్ప సేవా కార్యక్రమంగా మారిందని చెప్పారు. ప్రాణదానం ట్రస్టు ను టీటీడీ వైద్య సేవలకు బెస్ట్ మోడల్ గా తయారు చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. నిపుణులైన వైద్యుల సేవల్ని కూడా వినియోగించుకోవాలన్నారు. టీటీడీ పరిధిలో ఉన్న అన్ని ఆస్పత్రుల సేవల్ని అనుసంధానించాలని.. కేన్సర్ , కంటి వైద్యం సహా తిరుపతిలోని ఆయుర్వేద వైద్య సేవల్ని కూడా విస్తృతం చేయాలన్నారు. వైద్యులను శ్రీవారి సేవకులుగా మార్చి వైద్య సేవలతో పాటు బోధన కార్యక్రమాల్లోని సేవల్ని వినియోగించు కోవాలన్నారు. టీటీడీ పరిధిలోని 33 విద్యా సంస్థల వ్యవస్థను మరింత సమర్థంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు సూచించారు. విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, హాస్టళ్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని చెప్పారు. విద్య, వైద్యం, చారిటీ సేవలను పెద్ద ఎత్తున విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతిలోని శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

దివ్యక్షేత్రంగా తిరుపతి అభివృద్ధి
తిరుమలతో పాటు దిగువన ఉన్న తిరుపతిని సంపూర్ణ దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు. శ్రీవారి సంప్రదాయాలకు అనుగుణంగా కల్యాణాలు నిర్వహించుకునే వేదికగా తిరుపతిని అభివృద్ధి చేయాలని తిరుపతిలో స్పష్టం చేశారు. ఆధ్యాత్మికత, పవిత్రత ప్రతిబింబించేలా ప్రత్యేక ఎకోసిస్టమ్‌ను రూపొందించాలని చెప్పారు. నిపుణులైన భక్తుల భాగస్వామ్యంతో టీటీడీ సేవలు మరింత విస్తృతంగా ప్రజలకు చేరేలా చూడాలన్నారు.