News

హిమాలయాల రక్షణకు ‘హిమాలయ బోర్డు’ ఏర్పాటు చేయాలి: సద్గురు

24views

కఠ్మాండు: హిమాలయ ప్రాంతాల్లో విపత్తులను ఎదుర్కోవడంతో పాటు పర్వతాల పరిరక్షణకు భారత్, చైనా, పాకిస్థాన్, నేపాల్, భూటాన్‌లతో కూడిన ‘హిమాలయ బోర్డు’ ఏర్పాటు చేయాలని ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ పిలుపునిచ్చారు. సున్నితమైన హిమాలయ ప్రాంతం విషయంలో రాజకీయాలకు అతీతంగా సరిహద్దు దేశాల మధ్య సహకారం అవసరమని ఆయన అన్నారు.

ఆదివారం కఠ్మాండులో నిర్వహించిన ‘నేపాల్‌కు సంఘీభావం’ కార్యక్రమంలో సద్గురు ప్రసంగించారు. ప్రకృతి విపత్తుల సమయంలో తక్షణ సహాయం అందించడంతో పాటు.. హిమాలయాల పరిరక్షణ విషయంలో విస్తృత స్థాయిలో సామూహిక బాధ్యతను స్వీకరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

హిమాలయాలు దేశాల మధ్య గీసిన సరిహద్దులకు పరిమితం కావని సద్గురు అన్నారు. ఈ పర్వత ప్రాంత భవిష్యత్తు వాటిపై ఆధారపడి జీవిస్తున్న అన్ని దేశాలు, ప్రజలతో ముడిపడి ఉందని పేర్కొన్నారు.

‘‘పర్వతాలకు మీ రాజకీయాలు తెలియవు. మీరు మాట్లాడే భాష కూడా పర్వతాలకు తెలియదు. హిమాలయ ప్రాంతం భూమిపై అత్యంత అద్భుతమైన, అదే సమయంలో అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఒకటి. వాటి పరిరక్షణ కోసం హిమాలయాలు విస్తరించి ఉన్న దేశాలన్నింటితో కూడిన సంస్థను ఏర్పాటు చేయడం తక్షణ అవసరం’’ అని సద్గురు అన్నారు.

ఇటీవలి విపత్తు తీవ్రత ఊహించిన దానికంటే ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. నేపాల్‌ వంటి చిన్న దేశం ఇలాంటి విపత్తు పరిణామాలను ఒంటరిగా ఎదుర్కోవడం సాధ్యం కాదని.. దీనిపై అన్ని దేశాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సద్గురు అన్నారు.

నేపాల్‌ విపత్తు సహాయ నిధికి రూ.కోటి విరాళం

నేపాల్‌ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి రూ.కోటి విరాళంగా అందించనున్నట్లు సద్గురు హామీ ఇచ్చారని ఇషా ఫౌండేషన్‌ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

చైనా–నేపాల్‌ సరిహద్దు సమీప ప్రాంతాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల అనంతరం ఇషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది యాత్రికుల బృందం ఆచూకీ లేకుండా పోయిందని సంస్థ తెలిపింది. నేపాల్‌ వైపు ఉన్న ముగ్గురు ఇషా వాలంటీర్ల ఆచూకీ కూడా లభించలేదని పేర్కొంది.

ఇషా ఫౌండేషన్‌ ప్రతి సీజన్‌లో కైలాస్‌ మానసరోవర్‌ యాత్రలను నిర్వహిస్తోంది. ఈ యాత్రల్లో భాగంగా యాత్రికుల బృందాలు కఠ్మాండు నుంచి నేపాల్‌ మీదుగా టిబెట్‌కు కాలినడకన ట్రెక్కింగ్‌ చేస్తూ వెళ్తుంటాయి.