
చెన్నై: తమిళనాడులోని ప్రముఖ ఆలయాల్లో సెల్‌ఫోన్ల వినియోగంపై నిషేధం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఆలయాల పవిత్రత, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడటంతో పాటు భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇటీవల పలు ఆలయాల్లో భక్తులు సెల్‌ఫోన్లతో వీడియోలు చిత్రీకరించి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం వివాదానికి దారితీసింది. దీనిపై భక్తులు, హిందూ సంఘాల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో సెల్‌ఫోన్ల వినియోగాన్ని నిషేధిస్తూ అధికారులు చర్యలు చేపట్టారు.
నిషేధం అమల్లోకి వచ్చిన ఆలయాల్లో రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం, మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం, తిరుచ్చిలోని శ్రీరంగనాథస్వామి ఆలయం, తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం, చెన్నై తిరువళ్లిక్కేణి పార్థసారథి ఆలయం, మైలాపూర్ కపాలీశ్వర ఆలయం తదితర ప్రముఖ ఆలయాలు ఉన్నాయి.
ఆలయాల్లోకి వచ్చే భక్తులు తమ మొబైల్ ఫోన్లను వెంట తీసుకెళ్లకుండా, ఆలయాల సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక భద్రతా కేంద్రాల్లో జమ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రూ.5 రుసుము చెల్లించి మొబైల్ ఫోన్లను భద్రపరుచుకునే సదుపాయాన్ని అధికారులు కల్పించారు.
ఆలయ ప్రాంగణాల్లో ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం వల్ల పవిత్రతకు భంగం కలుగుతోందని అధికారులు పేర్కొన్నారు. భక్తులు నిబంధనలను పాటించి ఆలయాల పవిత్రతను కాపాడేందుకు సహకరించాలని కోరారు.





