News

సహజ జీవనమే ఆరోగ్యానికి శాశ్వత పునాది

26views

ప్రకృతికి అనుగుణంగా జీవించడం, సహజ ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి పొందడం, స్వచ్ఛమైన నీరు, గాలిని అలవాటుగా చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చని ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు డా. మంతెన సత్యనారాయణ రాజు తెలిపారు.

ఆయుష్‌, టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో నిర్వహించిన ‘యోగ, ప్రకృతి వైద్యంతో ఆరోగ్య పరిరక్షణ’ అవగాహన కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా డా. మంతెన సత్యనారాయణ రాజు మాట్లాడుతూ.. ఆధునిక జీవనశైలిలో మారుతున్న ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం, తగినంత విశ్రాంతి లేకపోవడం వంటి కారణాలతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు.

సహజ ఆహారం, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి, తగినంత విశ్రాంతి ఆరోగ్యకరమైన జీవనానికి కీలకమైన అంశాలని పేర్కొన్నారు. ఆరోగ్యంపై ముందుగానే శ్రద్ధ పెట్టి మంచి జీవన అలవాట్లను పాటిస్తే అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చని సూచించారు.

శారీరక ఆరోగ్యంతో పాటు భావోద్వేగ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అత్యంత అవసరమని బెటర్‌ లివింగ్‌ సైన్స్‌, టెక్నాలజీ అండ్‌ డిజిటల్‌ వెల్‌నెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బాలకృష్ణ తెలిపారు. వేగవంతమైన జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళన, కోపం, నిరాశ వంటి భావోద్వేగాలను సమతుల్యంగా నిర్వహించుకోవాలని సూచించారు.

సానుకూల ఆలోచనలు, ప్రశాంతమైన మనసు ఆనందమయ జీవితానికి బలమైన పునాదులని ఆయన పేర్కొన్నారు. ప్రతిరోజూ కొంత సమయాన్ని యోగా, ధ్యానం, వ్యాయామానికి కేటాయించడంతో పాటు ప్రకృతితో మమేకం కావాలని సూచించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆప్యాయంగా గడపడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుందని తెలిపారు.

సమస్యలను చూసి ఆందోళన చెందడం కంటే వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించడంపై దృష్టి పెట్టాలని చెప్పారు. తద్వారా ఆత్మవిశ్వాసం, మానసిక స్థైర్యం పెంపొందుతాయని పేర్కొన్నారు.

ప్రస్తుత కాలంలో సాంకేతికత ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగంగా మారిందని, మొబైల్‌ ఫోన్లు, సోషల్‌ మీడియా, ఇతర డిజిటల్‌ పరికరాల వినియోగంలో సమతుల్యత పాటించడం అవసరమని బాలకృష్ణ సూచించారు. అవసరానికి మించి డిజిటల్‌ పరికరాలకు సమయం కేటాయించకుండా కుటుంబం, ప్రకృతి, వ్యాయామం, ఆధ్యాత్మిక చింతనకు కూడా సమయం కేటాయించాలని అన్నారు.

శారీరక ఆరోగ్యం, భావోద్వేగ సమతుల్యత, డిజిటల్‌ వెల్‌నెస్‌.. ఈ మూడింటినీ సమన్వయం చేసుకున్నప్పుడే ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన, ఆనందమయ జీవితాన్ని గడపగలమని ఆయన పేర్కొన్నారు.