
తిరుపతిలోని టీటీడీ శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో సెప్టెంబరు 4న గోకులాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీకృష్ణ జన్మదిన వేడుకలకు గోసంరక్షణశాల ఆధ్యాత్మిక వేదికగా ముస్తాబవుతోంది. భక్తుల్లో ఆధ్యాత్మిక భావనను పెంపొందించేలా గోపూజతో పాటు వేదపఠనం, భజనలు, కోలాటాలు, హరినామ సంకీర్తనలు, హరికథ తదితర కార్యక్రమాలను టీటీడీ నిర్వహించనుంది.
గోవులను ప్రేమించిన గోపాలకృష్ణుడి జన్మదినమైన గోకులాష్టమికి గోసంరక్షణశాలలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. సనాతన ధర్మంలో గోమాతను పవిత్రంగా భావిస్తూ గోసేవ, గోపూజలకు విశిష్ట స్థానం కల్పించారు. ఈ సంప్రదాయాన్ని భక్తుల్లో మరింతగా పెంపొందించాలనే ఉద్దేశంతో టీటీడీ ప్రతి ఏటా గోకులాష్టమి వేడుకలను నిర్వహిస్తోంది.
గోకులాష్టమి సందర్భంగా గోసంరక్షణశాలను మామిడి తోరణాలు, పూలమాలలు, ప్రత్యేక అలంకరణలతో గోకులాన్ని తలపించేలా తీర్చిదిద్దుతున్నారు. గోవులను సైతం అందంగా అలంకరించి భక్తులకు కనువిందు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు గోవులకు బెల్లం, బియ్యం, పశుగ్రాసం అందించడం ద్వారా గోసేవలో భాగస్వాములు కావచ్చని టీటీడీ తెలిపింది. గోమాతకు గ్రాసదానం పుణ్యప్రదమని విశ్వసించే భక్తులు ఈ పవిత్ర అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.
గోకులాష్టమి రోజున ఉదయం 5 గంటలకు శ్రీ వేణుగోపాలస్వామివారికి అభిషేకం నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటలకు వేణుగానం, 7.30 గంటలకు వేదపఠనం ఉంటాయి. టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు కళాకారుల ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించనుండగా, ఉదయం 8 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీహరి సంకీర్తనలు ఆలపించనున్నారు.
ఉదయం 10 గంటలకు శ్రీ వేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, హారతి నిర్వహిస్తారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయి. భక్తులకు స్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.
సాయంత్రం టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణుడి దివ్య లీలలు, గోసేవ మహత్యాన్ని వివరించే హరికథ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
శ్రీకృష్ణ నామస్మరణ, గోపూజ, గోసేవ, భక్తి పారవశ్యంతో సాగనున్న ఈ గోకులాష్టమి వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోపూజ, గోసేవలో భాగస్వాములు కావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.





