News

తిరుమలకు బ్రహ్మోత్సవ శోభ

35views

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి ఏడాది పొడవునా నిర్వహించే ఉత్సవాల్లో బ్రహ్మోత్సవాలు ప్రధానమైనవి. అధికమాసంతో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు భక్తులను కనువిందు చేయనున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతీ మూడో ఏట అధికమాసం వస్తుంది. కన్యామాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో(ఆశ్వయుజం)లో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. సెప్టెంబరు 15 నుంచి 23 వరకు సాలకట్ల(వార్షిక) బ్రహ్మోత్సవాలు, అక్టోబర్‌ 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉదయం వాహనసేవ 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహన సేవ 7 నుంచి 9 గంటల వరకు, గరుడ వాహనసేవ సాయంత్రం 6.30 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది.
అంకురార్పణం..

వైఖానస ఆగమ క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం ముఖ్యమైంది. దీన్ని ఈ నెల 14న రాత్రి 7-8 గంటల మధ్య నిర్వహిస్తారు. శ్రీస్వామివారి సేనాధిపతి శ్రీవిష్వక్సేనులవారు వసంత మండపానికి ఊరేగింపుగా వెళతారు. అక్కడ భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి మన్నులో 9 రకాల ధాన్యాలు నాటుతారు. అంకురాలను ఆరోపింపజేసే ఈ కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణ అయింది.

కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం.. బ్రహ్మోత్సవాలు, ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశికి ముందు మంగళవారం కోయిళ్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ నెల 8న ఉదయం 6 నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. ఆనంద నిలయం మొదలు బంగారు వాకిలి వరకు, ఉపాలయాలు, పోటు, ఆలయ ప్రాంగణ గోడలు, పైకప్పు, పూజాసామగ్రి శుద్ధి చేస్తారు.

ధ్వజారోహణం..
బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. ఈ నెల 15వ తేదీ సాయంత్రం 6.21 నుంచి 6.35 గంటల వరకు జరుగుతుంది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి సమక్షంలో వేదగానాలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేసి సకల దేవతలు, అష్టదిక్పాలకులను ఆహ్వానిస్తారు. అనంతరం వాహనసేవలు వైభవంగా ప్రారంభమవుతాయి.

పురాణ నేపథ్యం ఇలా..
శ్రీనివాసుడు వేంకటాద్రిపై వెలసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవుడిని పిలిచి లోకకల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారనేది పురాణగాథ. ఆ ప్రకారమే శ్రీవేంకటేశ్వరుడు ఆనంద నిలయం మధ్యలో ఆవిర్భవించిన కన్యామాసం(ఆశ్వయుజం)లోని శ్రవణా నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు తొమ్మిది రోజులు ఉత్సవాలు నిర్వహించారు. అందుకే ఇవి ‘బ్రహ్మోత్సవాలు’గా ప్రసిద్ధి చెంది నిరాటంకంగా కొనసాగుతున్నాయి.