News

భువన విజయము : అష్టదిగ్గజాల సాహితీ వైభవాన్ని ఆవిష్కరించిన రూపకం

5views

విజయవాడ: తెలుగు సాహిత్య చరిత్రలో స్వర్ణయుగంగా ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి సాహితీ వైభవాన్ని కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించింది ‘భువన విజయము’ సాహిత్య రూపకం. విజయవాడలో దృశ్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమానికి స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, విజయవాడ డైరెక్టర్ డా. సిరికొండ రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దొంతాల ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని సాహితీ వాతావరణం, అష్టదిగ్గజ కవుల పాండిత్యం, తెలుగు పద్యంలోని మాధుర్యం, తెనాలి రామకృష్ణుడి హాస్యచతురత వంటి అంశాలను సమన్వయం చేస్తూ ఈ సాహిత్య రూపకాన్ని రూపొందించారు. చారిత్రక నేపథ్యాన్ని, సాహిత్య వైభవాన్ని రంగస్థలంపై ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అష్టదిగ్గజాల పాత్రల్లో ప్రముఖులు
శ్రీకృష్ణదేవరాయల పాత్రను దృశ్యవేదిక అధ్యక్షుడు అంబటి మధుమోహన కృష్ణ పోషించగా, తిమ్మరుసు పాత్రలో ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి నటించారు.

అల్లసాని పెద్దనగా డా. గుమ్మా సాంబశివరావు, మాదయగారి మల్లనగా డా. కానుకొల్లు బాలకృష్ణ, నంది తిమ్మనగా పంతుల తపస్వి, పింగళి సూరనగా డా. జి.వి. చలపతిరావు, ధూర్జటిగా కుందా విజయరామ్, మొల్లగా శ్రీమతి ముదిగొండ బాల కాత్యాయని, భట్టుమూర్తిగా పోపూరి గౌరీనాథ్, తెనాలి రామకృష్ణగా మల్లాప్రగడ నందకిశోర్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

నాలుగేళ్ల బాలకవి ప్రత్యేక ఆకర్షణ
కార్యక్రమంలో నాలుగేళ్ల బాలకవి చి. మల్లాప్రగడ అభిరామ్ పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్న వయసులోనే పద్య సాహిత్యంపై ఆసక్తిని ప్రదర్శించిన బాలకవిని ప్రేక్షకులు అభినందించారు.

నర్తకి సాయి నీహారిక అందించిన నృత్య ప్రదర్శన కార్యక్రమానికి ప్రత్యేక శోభను తీసుకొచ్చింది. ఈ కార్యక్రమాన్ని స్వర్గీయ కృష్ణాస్వరరావుకు అంకితం చేశారు.కార్యక్రమానికి జి. సత్యానందిని వ్యాఖ్యాతగా వ్యవహరించి సమర్థవంతంగా నిర్వహించారు.

భావితరాలకు తెలుగు సాహిత్య పరిచయం
తెలుగు భాష, సాహిత్య వైభవాన్ని భావితరాలకు పరిచయం చేయడంతో పాటు, తెలుగు సాహిత్యంలోని గొప్ప సంప్రదాయాన్ని నేటి తరానికి చేరువ చేయాలనే ఉద్దేశంతో ‘భువన విజయము’ రూపకాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో పద్మశ్రీ, నరేన్ బొర్రా, వెనిగళ్ల భాస్కర్, ఎల్.ఎస్.ఆర్.కె. ప్రసాద్, అనిల్, రఘు తదితరులు కీలకంగా కృషి చేశారు. తెలుగు సాహితీ చరిత్రలోని వైభవాన్ని రంగస్థలంపై ఆవిష్కరించిన ‘భువన విజయము’ ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు అందుకుంది.