News

కాశ్మీరీ పండిట్లకు బెదిరింపు లేఖలపై రాష్ట్రపతికి బహిరంగ లేఖ

5views

కాశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని వరుసగా వెలువడుతున్న బెదిరింపు లేఖలు ఆందోళన కలిగిస్తున్నాయి. 1990వ దశకంలో జరిగిన సామూహిక వలసల చేదు జ్ఞాపకాలను ఈ పరిణామాలు మరోసారి గుర్తు చేస్తున్నాయి. తాజాగా కాశ్మీర్‌ లోయతో పాటు జమ్మూలోనూ కొందరు కాశ్మీరీ పండిట్‌ ఉద్యోగుల పేర్లు, ఫోన్‌ నంబర్లు, నివాస చిరునామాలు వంటి వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేస్తూ బెదిరింపులు వెలువడినట్లు సమాచారం.

ఈ పరిణామాలపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులను గుర్తించాలని సామాజిక కార్యకర్త సంజయ్‌ సప్రూ రాష్ట్రపతికి బహిరంగ లేఖ రాశారు. ఈ బెదిరింపులను సాధారణ సోషల్‌ మీడియా పోస్టులుగా కాకుండా జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా పరిగణించాలని కేంద్ర హోంశాఖ, జమ్మూ కాశ్మీర్‌ పరిపాలనను ఆయన కోరారు. పండిట్‌ ఉద్యోగులు, వారి కుటుంబాలకు భద్రత కల్పించడంతో పాటు బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు కాలపరిమితితో కూడిన దర్యాప్తు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ లేఖ ప్రతులను ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, జమ్మూ కాశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు కూడా పంపినట్లు తెలిపారు.

కాశ్మీరీ పండిట్‌ సంఘర్ష్‌ సమితి అధ్యక్షుడు సంజయ్‌ టికూ ప్రకారం.. ‘యునైటెడ్‌ లిబరేషన్‌ కౌన్సిల్‌’ (యూఎల్‌సీ) పేరుతో సోషల్‌ మీడియాలో ఓ బెదిరింపు లేఖ ప్రత్యక్షమైంది. ఇందులో పండిట్‌ ఉద్యోగుల పేర్లు, వ్యక్తిగత వివరాలను పొందుపరిచినట్లు ఆయన తెలిపారు. ఈ సంస్థకు లష్కర్‌-ఎ-తోయిబాతో సంబంధాలు ఉండొచ్చన్న అనుమానాలు భద్రతా వర్గాల్లో ఉన్నట్లు సమాచారం. అయితే లేఖ ప్రామాణికతను భద్రతా సంస్థలు పరిశీలిస్తున్నాయని టికూ తెలిపారు.

1990లలో బెదిరింపులు పోస్టర్లు, లౌడ్‌స్పీకర్లు, ప్రచారం ద్వారా వ్యాపించాయని.. ఇప్పుడు అదే తరహా బెదిరింపులు డిజిటల్‌ వేదికలు, ఎన్‌క్రిప్టెడ్‌ కమ్యూనికేషన్‌ మార్గాల ద్వారా వ్యాప్తి చెందుతున్నాయని టికూ పేర్కొన్నారు.

కాశ్మీర్‌ లోయలో పనిచేస్తున్న కాశ్మీరీ పండిట్లను ‘పద్ధతులు మార్చుకోవాలని’ హెచ్చరిస్తూ వచ్చిన లేఖ వెలువడిన కొద్దికాలానికే జమ్మూలో మరో బెదిరింపు లేఖ బయటపడినట్లు సమాచారం. ఈ లేఖలో సుమారు అరడజను మంది కాశ్మీరీ పండిట్ల పేర్లతో పాటు వారి నివాస ప్రాంతాల వివరాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని ‘వైట్‌ కాలర్‌ టెర్రరిస్టులు’, ‘ద్రోహులు’ అంటూ ఆరోపిస్తూ బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం.

అహ్మద్‌ బిలాల్‌ అనే వ్యక్తి పేరుతో సంతకం చేసినట్లు చెబుతున్న ఈ లేఖను యూఎల్‌సీ పేరుతో విడుదల చేసినట్లు సమాచారం. ఇందులో సంబంధిత వ్యక్తులపై నిఘా కొనసాగుతోందనే హెచ్చరికలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే భద్రతా సంస్థలు ఈ లేఖల ప్రామాణికతను పరిశీలిస్తూ, వాటి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నాయి.

తాజా బెదిరింపుల్లో మరో అంశం కూడా ఆందోళన కలిగిస్తోంది. 1990లలో కాశ్మీర్‌ నుంచి వలస వెళ్లకుండా లోయలోనే ఉండిపోయిన కొందరు పండిట్లు తమ లక్ష్యం కాదని, ప్రభుత్వ ఉద్యోగాల కోసం తిరిగి లోయకు వచ్చినవారినే లక్ష్యంగా చేసుకున్నట్లు లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో కాశ్మీరీ పండిట్‌ సమాజంలోనే విభజన సృష్టించే ప్రయత్నం జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా పునరావాసం, ఉపాధి పథకాల ద్వారా లోయకు తిరిగి వచ్చిన కాశ్మీరీ పండిట్‌ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆగస్టు ప్రారంభంలోనూ కాశ్మీరీ పండిట్‌ ఉద్యోగుల పేర్లు, ఫోన్‌ నంబర్లతో కూడిన బెదిరింపు సమాచారం ఆన్‌లైన్‌లో ప్రచారమైనట్లు తెలుస్తోంది. తాజాగా నివాస చిరునామాల వరకు బహిర్గతం కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

ఉద్యోగుల వ్యక్తిగత వివరాలు, నివాస ప్రాంతాల సమాచారం వంటి సున్నితమైన డేటా బెదిరింపులు చేస్తున్న వ్యక్తుల చేతికి ఎలా చేరిందన్న ప్రశ్న ఇప్పుడు కీలకంగా మారింది. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కాశ్మీరీ పండిట్‌ సంఘాలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ బెదిరింపులు తీవ్ర ఆందోళన కలిగించే విషయమని జమ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని పోలీసు, నిఘా సంస్థలను కోరారు. పండిట్‌ ఉద్యోగుల భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తామని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పరిపాలన కూడా హామీ ఇచ్చినట్లు సమాచారం.

అయితే గతంలో జరిగిన లక్షిత హత్యలు, వరుస బెదిరింపుల నేపథ్యంలో కేవలం హామీలతో తమ భద్రతపై నమ్మకం కలగడం లేదని పలువురు కాశ్మీరీ పండిట్‌ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1990లలో భయపెట్టి స్వస్థలం విడిచి వెళ్లేలా చేసిన పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా కాశ్మీరీ పండిట్ల భద్రత, గౌరవం, తమ స్వస్థలంలో జీవించే హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్న డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది.