News

మహిళలు బహిరంగ జీవితంలోకి రావడం వల్ల నష్టం : సున్నీ మత గురువు

6views

తిరువనంతపురం: మహిళలు మతపరమైన వేడుకలు, బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనడంపై సున్నీ మత గురువు కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ చేసిన వ్యాఖ్యలు కేరళలో తీవ్ర చర్చకు దారితీశాయి. మహిళలను బహిరంగ వేదికలు, కార్యక్రమాలకు దూరంగా ఉంచాలన్న ఆయన వైఖరిపై రాజకీయ, సామాజిక వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

తాజాగా కేరళ మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి ఆర్. బిందు కూడా కాంతపురం వ్యాఖ్యలను తప్పుబట్టారు. ప్రతి వ్యక్తికి తన మత విశ్వాసాలను అనుసరించే హక్కు ఉందని, అయితే మత విశ్వాసాలు భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కుల కంటే పై స్థాయిలో ఉండకూడదని ఆమె స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రతి పౌరుడి గౌరవం, సమానత్వాన్ని కాపాడుతుందని గుర్తుచేశారు.

లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరికీ బహిరంగ జీవితంలో పాల్గొనే స్వేచ్ఛ ఉందని బిందు అన్నారు. తమ ప్రతిభను నిరూపించుకునే హక్కు మహిళలకు కూడా ఉందని పేర్కొన్నారు. భారత రాష్ట్రపతి పదవిలో మహిళ ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వంటి మహిళలు దేశ రాజకీయాలను నడిపించారని తెలిపారు. పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోను కూడా ఉదాహరణగా ప్రస్తావించారు.

మాజీ మంత్రి కేకే శైలజ కూడా కాంతపురం వ్యాఖ్యలను వ్యతిరేకించారు. కేరళలో ముస్లిం మహిళలు ఎమ్మెల్యేలు, పంచాయతీ అధ్యక్షులు, న్యాయమూర్తులు, శాస్త్రవేత్తలుగా రాణిస్తున్న సమయంలో వారిని ఇళ్లకే పరిమితం చేయాలనుకోవడం కాలానుగుణంగా లేదని అన్నారు.

ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ కూడా కాంతపురం వర్గం జారీ చేసిన సర్క్యులర్‌పై అభ్యంతరం వ్యక్తం చేశాయి. మహిళలపై ఇలాంటి ఆంక్షలు విధించడం వెనుకబాటుతనానికి నిదర్శనమని విమర్శించాయి. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఎం. ఫాతిమా బీవీ కేరళకు చెందినవారనే విషయాన్ని గుర్తుచేశాయి.

బీజేపీ సైతం కాంతపురం వర్గం సర్క్యులర్‌ను విమర్శించింది. మహిళల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించే విధంగా ఆదేశాలు ఉండకూడదని పేర్కొంది. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా కొన్ని పార్టీలు ఈ అంశంపై మౌనం వహిస్తున్నాయని ఆరోపించింది. ప్రముఖ ఆలోచనాపరుడు ఎం.ఎన్. కారశేరి కూడా రాజ్యాంగం కల్పించిన లింగ సమానత్వం, వ్యక్తిగత స్వేచ్ఛకు విరుద్ధమైన అభిప్రాయాలను ప్రజాస్వామ్య సమాజం అంగీకరించకూడదని అన్నారు.

ఈ వివాదానికి కారణమైన సర్క్యులర్‌ను మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకల నేపథ్యంలో కాంతపురం వర్గం మహల్, మదర్సా కమిటీలకు జారీ చేసినట్లు సమాచారం. మతపరమైన కార్యక్రమాల్లో సంబంధం లేని పురుషుల మధ్య యువతులను తీసుకురావద్దని అందులో సూచించినట్లు తెలుస్తోంది. మహిళలను బహిరంగ వేదికలు, రోడ్లపై ప్రదర్శనలా చూపించడం విశ్వాసులకు తగదని పేర్కొన్నట్లు సమాచారం. మత కార్యక్రమాల్లో ఇస్లామిక్ నియమాలను పాటించాలని, ఇతర ఆచారాలు, పద్ధతులను కలపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించినట్లు తెలుస్తోంది.

సర్క్యులర్‌పై విమర్శలు పెరుగుతున్న సమయంలో కొచ్చిలో జరిగిన హుబ్బుర్ రసూల్ సమావేశంలో కాంతపురం తన వైఖరిని మరోసారి సమర్థించుకున్నట్లు సమాచారం. మహిళలు బహిరంగ జీవితంలోకి రావడం వల్ల నష్టం జరుగుతుందని, వారు నిరాడంబరంగా ఇళ్లలోనే జీవించాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. మహిళలు బహిరంగ జీవితంలోకి రాకుండా ఉండేందుకే ఇస్లాంలో పర్దా విధానం తప్పనిసరి చేశారని ఆయన పేర్కొన్నట్లు సమాచారం.

తాను మతపరమైన విషయాల్లో సమాజానికి సూచనలు చేసే అధికారం కలిగిన వ్యక్తినని, విమర్శలకు భయపడి తన అభిప్రాయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని కాంతపురం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఈ వ్యాఖ్యలతో కేరళలో మత విశ్వాసాలు, మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ, లింగ సమానత్వం, రాజ్యాంగ హక్కుల మధ్య సమతుల్యతపై మరోసారి విస్తృత చర్చ మొదలైంది.