News

పాకిస్థాన్‌పై భారత్‌ వైఖరి ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో స్పష్టమైంది : మాజీ ఆర్మీ చీఫ్‌ నరవణె

17views

పాకిస్థాన్‌ విషయంలో భారతదేశ విధానంలో గణనీయమైన మార్పు చోటుచేసుకుందని ‘ఆపరేషన్‌ సిందూర్‌’ స్పష్టం చేసిందని మాజీ సైన్యాధిపతి జనరల్‌ ఎం.ఎం. నరవణె అన్నారు. వడోదరలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు.

గతంలో భారత సైన్యం పాకిస్థాన్‌ సరిహద్దుకు సమీపంలోని ఉగ్రవాద స్థావరాలపైనే ప్రధానంగా దాడులు చేసేదని నరవణె గుర్తుచేశారు. అయితే ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో భారత్‌ తన వ్యూహాన్ని మార్చుకుందని తెలిపారు. పాకిస్థాన్‌ లోతట్టు ప్రాంతాల్లో ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్న వారిపై కూడా దాడులు చేయగల సామర్థ్యం, సంకల్పాన్ని భారత్‌ ప్రదర్శించిందని పేర్కొన్నారు.

పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ద్వారా.. ఉగ్రవాదులు, వారికి మద్దతు ఇచ్చేవారు ఎక్కడ ఉన్నా వారిని శిక్షించేందుకు భారత్‌ వెనుకాడదనే సందేశం వెళ్లిందని నరవణె అన్నారు.

గతంలో ఉరి, పుల్వామా ఉగ్రదాడుల అనంతరం జరిగిన సైనిక చర్యలు, బాలాకోట్‌ వైమానిక దాడి ప్రధానంగా సరిహద్దుకు సమీపంలోని ఉగ్రవాద స్థావరాలపై కేంద్రీకృతమై ఉండేవని ఆయన వివరించారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో మాత్రం పాకిస్థాన్‌ భూభాగంలో మరింత లోతుగా ఉన్న ఉగ్రవాద మౌలిక వ్యవస్థ, వారికి సహకరిస్తున్నవారిని లక్ష్యంగా చేసుకునే విషయంలో భారత్‌ తన వైఖరిని స్పష్టం చేసిందని తెలిపారు.