News

ఇస్లాం ‘శ్రేష్ఠ ధర్మం’ అంటూ కర్ణాటక మంత్రి వ్యాఖ్యలు..

0views

బెంగళూరు: కర్ణాటక విద్యాశాఖ మంత్రి బసవరాజ్ రాయారెడ్డి చేసిన ఇస్లాం మతంపై వ్యాఖ్యలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొప్పల్ జిల్లా కుక్నూర్ ప్రాంతంలో నిర్వహించిన ఓ ముస్లిం సామూహిక వివాహ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. ఇతర మతాలతో పోలిస్తే ఇస్లాం ‘శ్రేష్ఠ ధర్మం’ (అత్యుత్తమ మతం) అని వ్యాఖ్యానించారు.

ఇస్లాం మతంపై సమాజంలో కొన్ని అపోహలు ఉన్నాయని రాయారెడ్డి పేర్కొన్నారు. తాను ఖురాన్‌తో పాటు ఇతర మతాల చరిత్రను కూడా అధ్యయనం చేశానని తెలిపారు. ఇస్లాం క్రమశిక్షణతో కూడిన, శాస్త్రీయ దృక్పథం, మానవతా విలువలు కలిగిన మతమని ఆయన ప్రశంసించారు.

అన్ని మతాలు మానవాళి శ్రేయస్సును లక్ష్యంగా చేసుకున్నవేనని మంత్రి అన్నారు. ప్రతి ఒక్కరూ ఇతర మతాల్లోని మంచి విషయాలను గౌరవించాలని సూచించారు.

తాను మక్కాను సందర్శించాలని గతంలో కోరుకున్నానని, అయితే ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం ముస్లింలకు మాత్రమే అక్కడ ప్రవేశం ఉంటుందని భావించి ఆ కోరిక నెరవేరలేదని రాయారెడ్డి చెప్పారు.

కేవలం మసీదులను సందర్శించడం లేదా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రమే కాకుండా.. ఆయా మతాలు బోధించే విలువలను జీవితంలో ఆచరించడం ముఖ్యమని మంత్రి సూచించారు.

అయితే, ఇతర మతాల కంటే ఇస్లాం ‘శ్రేష్ఠమైనది’ అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి.