
న్యూఢిల్లీ: దేశంలో అత్యాచారాలు, నేరాలు, అవినీతిని అరికట్టాలంటే ఇస్లామిక్ చట్టం అమలు చేయాల్సిందేనంటూ ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ అధ్యక్షుడు మౌలానా సాజిద్ రషీదీ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. కొన్ని ఇస్లామిక్ దేశాల్లో నేరాలు, అవినీతి తక్కువగా ఉన్నాయని పేర్కొంటూ.. భారత్‌లో ఇస్లామిక్ చట్టం అమలు కానంత వరకు ఇటువంటి సమస్యలను పూర్తిగా నిర్మూలించడం కష్టమని ఆయన వ్యాఖ్యానించారు.
షరియా చట్టం అమలు పట్ల ప్రజల్లో భయం ఉండటమే భారత్‌లో అలాంటి వ్యవస్థ లేకపోవడానికి కారణమని కూడా రషీదీ పేర్కొన్నట్లు సమాచారం.
అయితే, రషీదీ వ్యాఖ్యలకు ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగి మహాలీ ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
‘ఇక్కడ రాజ్యాంగమే సుప్రీం’.. మరో మౌలానా స్పష్టత
భారత్ రాజ్యాంగం ప్రకారం నడిచే దేశమని ఖలీద్ రషీద్ స్పష్టం చేశారు. ప్రతి వ్యక్తికి తన మత విశ్వాసాలను, వ్యక్తిగత చట్టాలకు సంబంధించిన అంశాలను పాటించే స్వేచ్ఛ ఉన్నప్పటికీ.. అవన్నీ రాజ్యాంగ పరిధిలోనే ఉండాలని పేర్కొన్నారు.
వ్యక్తిగత చట్టాలకు కూడా పరిమితులు ఉంటాయని, అవి రాజ్యాంగ చట్రానికి వెలుపల పనిచేయలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఆయన గుర్తుచేశారు. నేరాలను అరికట్టేందుకు దేశంలో ఇప్పటికే చట్టాలు ఉన్నాయని తెలిపారు.
నేరాల నిర్మూలనకు ‘షరియా’ కాదు.. విద్య, విలువలు అవసరం!
సమాజంలోని దురాచారాలను నిర్మూలించేందుకు మత పెద్దలు కృషి చేయాలని ఖలీద్ రషీద్ అన్నారు. ప్రజలకు సరైన విద్య, నైతిక విలువలు అందించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.
సమాజంలో ఈ దిశగా తగిన ప్రయత్నాలు జరగనంత వరకు నేరాలను పూర్తిగా అరికట్టడం సవాలుగానే ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అంటే.. అత్యాచారాలు, అవినీతికి పరిష్కారం రాజ్యాంగాన్ని పక్కనపెట్టి షరియాను తీసుకురావడమా? లేక ఇప్పటికే ఉన్న చట్టాలను సమర్థంగా అమలు చేయడంతో పాటు విద్య, నైతిక విలువలను పెంపొందించడమా? అనే చర్చకు ఈ ఇద్దరు మౌలానాల వ్యాఖ్యలు తెరతీశాయి.
భారతదేశం ఒక రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ఏ మతపరమైన ఆచారం అయినా రాజ్యాంగం, దేశ చట్టాల పరిధిలోనే కొనసాగాల్సి ఉంటుంది. ఈ ప్రాథమిక అంశాన్ని ఖలీద్ రషీద్ చేసిన వ్యాఖ్యలు మరోసారి గుర్తుచేస్తున్నాయి.





