
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ డ్రోన్ సంచారం కలకలం రేపింది. ఎల్ఓసీ వెంబడి మెంధర్ సెక్టార్‌లోని బాలాకోట్ ప్రాంతంలో డ్రోన్ చక్కర్లు కొట్టడాన్ని భద్రతా దళాలు గుర్తించాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు సరిహద్దు జిల్లాలను జల్లెడపడుతున్నాయి. డ్రోన్ ఏదైనా అనుమానాస్పద వస్తువులను జారవిడిచిందా? లేదా ఏమైనా తీసుకెళ్లిందా? అనే కోణంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అధికారుల తెలిపిన వివరాల ప్రకారం, బాలాకోట్ ప్రాంతంలోని బెహ్రూటి గ్రామం వద్ద రాత్రి 8:05 గంటల ప్రాంతంలో ఓ డ్రోన్ కనిపించింది. కొంతసేపు ఆ ప్రాంతంలో చక్కర్లు కొట్టిన డ్రోన్, అనంతరం సరిహద్దుకు సమీపంలోని మంగళ్‌నార్-డబ్రోట్ వైపు కదిలినట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే తిరిగి పాకిస్థాన్ వైపు వెళ్లిపోయినట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన బలగాలు నిఘాను మరింత పెంచాయి. తెల్లవారుజామున రంగంలోకి దిగి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి.
అలాగే సరిహద్దు ప్రాంతంలో భద్రతా దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని అధికారుల చెప్పారు. డ్రోన్ కదలికలపై నిఘా కొనసాగుతోందని, అనుమానాస్పదంగా ఏదైనా గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకునేందుకు బలగాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. పూంచ్‌తో పాటు జమ్ము ప్రాంతంలోని మరికొన్ని జిల్లాల్లోనూ భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఉధంపూర్, కఠువా, రాజౌరి జిల్లాల పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో పోలీసులు, సైన్యం, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా బరిలోకి దిగాయి. శుక్రవారం సాయంత్రం నుంచి ఉధంపూర్-కఠువా అటవీ బెల్ట్‌లోని కుబాన్, నగేన్, ఖత్రైల్, గోడు ఫలాల్, పదేతర్, చోర్ మొట్టు, కియా, ఖేబా, భేద్, మార్తా, జోఫర్ తదితర మారుమూల గ్రామాలను జల్లెడపడుతున్నాయి.





