
భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) మాజీ జనరల్ జావో జోంగ్కీపై చైనా ప్రభుత్వం వేటు వేసింది. దేశంలోని అత్యున్నత రాజకీయ సలహా మండలి సభ్యత్వంతో పాటు ఆయన నిర్వహిస్తున్న ఇతర కీలక రాజకీయ పదవుల నుంచి జీవోను తొలగించింది. 2017లో జరిగిన డోక్లాం ప్రతిష్టంభన, 2020 నాటి గల్వాన్ లోయ ఘర్షణల సమయంలో జావో జోంగ్కీ పీఎల్ఏ వెస్ట్రన్ థియేటర్ కమాండ్‌కు అధిపతిగా వ్యవహరించారు.
చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ (CPPCC) స్టాండింగ్ కమిటీ ఆగస్టు 26న సమావేశమై జావోను పదవుల నుంచి తొలగించాలని ఓటింగ్ ద్వారా నిర్ణయించింది. జాతీయ కమిటీ సభ్యత్వంతో పాటు, జాతి, మతపరమైన వ్యవహారాల కమిటీ డిప్యూటీ డైరెక్టర్ పదవి నుంచి కూడా ఆయన్ను తప్పించారు. అయితే, ఈ నిర్ణయానికి గల కారణాలను చైనా ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. ఆయనపై ఎటువంటి విచారణకు ఆదేశించినట్లు కూడా ఇప్పటివరకు ప్రకటించకపోవడం గమనార్హం.
భారత్‌తో సరిహద్దు వ్యవహారాలను పర్యవేక్షించే వెస్ట్రన్ థియేటర్ కమాండ్‌కు 2016లో తొలి కమాండర్‌గా జావో నియమితులయ్యారు. ఆయన పదవీకాలంలోనే 2017లో 73 రోజుల పాటు డోక్లాం ప్రతిష్టంభన కొనసాగింది. అలాగే 2020లో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందిన గల్వాన్ ఘర్షణలు కూడా ఆయన పర్యవేక్షణలోనే జరిగాయి.
అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సైన్యంలో చేపట్టిన భారీ ప్రక్షాళనలో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవలే తీవ్రమైన క్రమశిక్షణా ఉల్లంఘనల ఆరోపణల నేపథ్యంలో జనరల్ జాంగ్ యోక్సియా, లియు జెన్లీలను కూడా సెంట్రల్ మిలిటరీ కమిషన్ నుంచి తొలగించారు. సైన్యంపై తన పట్టును మరింత బిగించుకునే క్రమంలోనే జిన్‌పింగ్ వరుసగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.





