
ఉత్తరాఖండ్‌లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లా రుద్రపూర్‌లో ఉన్న త్రిశూల్ చౌక్ వద్ద బారవాఫాత్ ఊరేగింపు సందర్భంగా ఒక మౌల్వీ ధామీ ప్రభుత్వంపై వివాదాస్పద, రెచ్చగొట్టే ప్రసంగం చేసిన వీడియో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తీవ్రంగా స్పందిస్తూ ఒక బహిరంగ సభలో హెచ్చరికలు జారీ చేశారు. మూసివేసిన మదర్సాలు మూసివేసినట్లేనని, ఇది దేవభూమి అని, ఇక్కడ ముల్లావాదీ ఆలోచనలకు ఎంతమాత్రం తావులేదని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రం అటువంటి ఉలేమాల తీవ్రవాద భావజాలంతో నడవదని ఉద్ఘాటించారు.
ఈ ఘటనపై ఉధమ్ సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. వివాదాస్పద ప్రసంగం చేసిన మౌల్వీ ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ ప్రాంతానికి చెందినవాడని, ప్రస్తుతం అజ్మీర్ పారిపోయాడని పోలీసులు గుర్తించారు. ఊరేగింపు నిర్వాహకులు, మైక్‌లో మాట్లాడిన మౌల్వీ పరారీలో ఉండటంతో వారి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. మతతత్వ వాతావరణాన్ని దెబ్బతీసేలా ప్రసంగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజయ్ గణపతి తెలిపారు.
ఈ ఊరేగింపులో ప్రభుత్వం మదర్సాలను మూసివేయడం, ఈద్గా భూములను స్వాధీనం చేసుకోవడంపై మాట్లాడిన మాటల పట్ల హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మరోవైపు ఈ ఘటనపై రాజకీయాలు తీవ్రరూపం దాల్చాయి. కాగా, ప్రభుత్వం మదర్సా బోర్డును రద్దు చేసి నూతన అల్పసంఖ్యాక విద్యా ప్రాధికార సంస్థను ఏర్పాటు చేసిందని, అందులో గుర్తింపు పొందడంతో పాటు జాతీయ పాఠ్యప్రణాళికను బోధించడం నిర్బంధం చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.





