ArticlesNews

మంచి సంతానం కోసం

0views

తల్లిదండ్రుల ఆచరణ బాగున్నపుడే చక్కటి సంతానం కలుగుతుందని పెద్దలు చెప్పారు. సంతానం కలుగడం పితృ ఋణం తీర్చుకునేందుకే అన్నారు. కుంతి భావాలు ఆదర్శమైనవి. అందుకే ధర్మరాజు పుట్టాడు. స్త్రీలు గర్భవతులైనపుడు తమ సంతానం శ్రేష్టమైనదిగా చేసుకునేందుకు భగవత్కథలు, భగవద్భక్తుల చరిత్రలు చదవాలి. వాటిని మననం చెయ్యాలి. అటువంటి చిత్రాలు చూడాలి. తల్లి మీద సత్సంగం ప్రభావం ఉండడం వల్ల శ్రేష్టమైన సంతానం కలుగుతుంది.

హిరణ్యకశిపుని భార్య లీలావతిని ఇంద్రుడు అపహరించి తీసుకుని వెళ్తుండగా నారదుడు ఆమెను రక్షించి తన ఆశ్రమంలో ఉంచుతాడు. అప్పుడు ఆమె గర్భవతి. నారదుడు ఆమెకు భగవత్కథలు, నారాయణ తత్త్వం ఉపదేశించేవాడు. అవి కడుపులో ఉన్న ప్రహ్లాదుడు కూడా వినడం వలన హరిభక్తుడిగా జననమొం దాడు. రాక్షస కులంలో పుట్టినా శ్రేష్ఠుడయ్యాడు. మంచి పనులు చేయడం, మంచి ఆలోచనలు చేయడం, మంచి విషయాలు చర్చిండం, మంచి వారితో కలిసి ఉండడంవల్ల మంచి సంతానం కలుగుతుంది. శ్రేష్ఠత్వం సాధించడం మన చేతుల్లోనే ఉంది. అందుకు సత్పురుషుల, మహాత్ముల సాంగత్యం చెయ్యాలి. మహాత్ములు లభించకపోతే సాధనలో మనిగియున్న సాధకుల సాంగత్యం చెయ్యాలి. వారు కూడా లభించకపోతే రామాయణం వంటి మంచి గ్రంథాల పఠనం, మననం చెయ్యాలి, శుభం కోరుకోవాలి.

ఆహార, విహార, విచారాదుల విషయంలో గర్భవతులు ఆనందంగా ఉండాలి. మంచిపిల్లలు పుట్టి మనల్ని అనుసరిస్తే మంచిదే. అలా కాక, మన ఆచరణ మంచిదైనా స్నేహం వల్ల పిల్లలు చెడిపోతే పూర్వ జన్మ రుణం తీర్చుకోవడానికి వచ్చాడనుకోవాలి. అలాంటివాడే తల్లిదండ్రులకు దుఃఖం కల్గిస్తాడు. అందుకే పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో, ఎక్కడ తిరుగుతున్నారో పెద్దలు గమనించాలి. పిల్లలకు స్వేచ్ఛనివ్వడం చాలా గొప్పగా కొందరు తల్లిదండ్రులు భావిస్తుంటారు. ఆడపిల్ల అయినా, మగపిల్లవాడైనా మనమిచ్చే స్వేచ్ఛ హద్దులు దాటకూడదు. విశ్రవసుడు బ్రాహ్మణుడు. కాని ఆయన భార్య కైకసి రాక్షస కులస్థురాలు. ఆ కారణాన రావణుడు పుట్టాడు. ఉగ్రసేనుడు ధర్మాత్ముడు. కాని ఒక రోజున ఒక రాక్షసుడు ఉగ్రసేనుడి రూపంలో అతని పత్నితో సంగమించాడు. అందుకే కంసుడు పుట్టాడు.

గర్భవతులైన హిందూ స్త్రీలు దక్షిణామూర్తిని రోజూ స్మరిస్తే జగద్గురువుల వంటి సంతానమైనా కల్గుతుందని చాగంటివారు చెబుతుంటారు. అలాగే సంతాన భాగ్యం కోసం చిన్ని కృష్ణుణ్ణి ఎదురుగా ఉన్నట్లు భావించి, సంతాన గోపాల మంత్రాన్ని 108 సార్లు జపించమని కూడా పెద్దలు చెబుతారు. అలాగే మంచి ఆరోగ్యశైలి అవసరం. పోషకాహారం తీసుకోవాలి. మానసిక ప్రశాంతత చాలా అవసరం. చెడు అవాట్లకు దూరంగా ఉండాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి. ధ్యానం చేయాలి, మంచి పుస్తకాలు చదవాలి, మంచి సంగీతం వినాలి. మహాపురుషుల జీవితగాథలు వినాలి. భార్య భర్తల మనస్సు ముఖ్యం. ఒకరిపట్ల ఒకరికి అంకిత భావం ఉండాలి. అప్పుడే మంచి సంతానం కలుగుతుంది. అమ్మవారిని పూజించి గర్భరక్షాంబికా స్తోత్రం పారాయణం చేయమని, గోసేవ చేయమని, దాన ధర్మాలు చేయమని పెద్దలు చెప్పారు.

– హనుమత్ ప్రసాద్