News

మజ్లిస్ ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌ అర్ధరాత్రి చర్యల వెనుక కారణాలు చెప్పాలన్న రాజాసింగ్

0views

ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలను ప్రజల ముందు ఉంచాలని ఆయన మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని డిమాండ్ చేశారు.

శుక్రవారం అర్ధరాత్రి రహ్మత్ బేగ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు మజ్లిస్ పార్టీ ప్రకటించింది. దీనితో పాటు, ఆయన తక్షణమే తన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేయాలని ఆదేశించింది. ఆయనపై ఉన్న కొన్ని వివాదాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు సంకేతాలిచ్చినప్పటికీ, బహిష్కరణకు గల నిర్దిష్ట కారణాలను మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.

ఈ నేపథ్యంలో రాజాసింగ్ మాట్లాడుతూ, ఈ బహిష్కరణ పాతబస్తీ ప్రజల్లో అనేక సందేహాలను రేకెత్తించిందని అన్నారు. అర్ధరాత్రి వేళ అత్యవసరంగా ఇటువంటి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు తలెత్తాయో పార్టీ నాయకత్వం వివరించాలని ఆయన ప్రశ్నించారు. అసదుద్దీన్ ఓవైసీ జాతీయ మీడియా ముందుకు వచ్చి, ఈ ఆరోపణలపై స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు.

భూవివాదాలు, లైంగిక వేధింపుల అంశాలకు సంబంధించిన ఆరోపణలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్నాయని రాజాసింగ్ గుర్తుచేశారు. గతంలో తనను డీప్‌ఫేక్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని రహ్మత్ బేగ్ సైబర్‌ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, తాజా పరిణామాలకు ఆ ఘటనతో ఏమైనా సంబంధం ఉందా అనే విషయంపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.