News

కశ్మీరీ పండిట్ల ఊచకోతపై 28 ఏళ్ల తర్వాత మళ్లీ దర్యాప్తు

11views

జమ్మూకాశ్మీర్ లోని వాందామాలో 1998లో 23 మంది కశ్మీరీ పండిట్ల నరమేధంపై ఆ రాష్ట్ర దర్యాప్త సంస్థ(ఎసీఐఏ) పునర్విచారణ ప్రారంభించింది. లోయలో ఉగ్రవాదులు జరిపిన ఘాతుకాలకు సంబంధించిన కేసులు ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉండటంతో మళ్లీ దర్యాప్తు ప్రారంభించింది. కశ్మీరీ పండిట్ అయిన నర్సు సర్దా భట్ ను 1990లో ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. ఈ కేసులో జేకేఎల్ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్ మాస్టర్ మైండ్ అని తేలుస్తూ ఎస్ఐఏ ఈ ఏడాది జూన్ లో 737 పేజీల చార్జ్ చీట్ దాఖలు చేసింది. అలాగే రచయిత సర్వానంద్ కౌల్ ప్రేమి ఆయన కుమారుడు వీరేందర్ కౌల్ హత్య కేసు లపై ఈ నెలలోనే తిరిగి దర్యాప్తు ప్రారంభించింది.  పలుచోట్ల తనిఖీలు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించింది. ఈ తరుణంలో వాందామా ఊచకోత కేసును తిరిగి తెరవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉగ్రవాది మక్బూల్ భట్ కు మరణశిక్ష విధించిన న్యాయ మూర్తి జస్టిస్ నీలాకాంత్ గంజూను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్న కేసుపై కూడా దర్యాప్తు తిరిగి ప్రారంభించనుంది. 1989 నవంబరు 4న జేకేఎల్ఎఫ్ ఉగ్రవాదులు శ్రీనగర్ లో నీల్కాంత్ ను కాల్చి చంపారు. 1989లో కాశ్మీరీ పండిట్ల నేత, న్యాయవాది టికాలాల్ టహ్ల హత్య కేసును కూడా ఎస్ఐఏ తిరిగి దర్యాప్తు చేయనుంది.

చిన్నారులనే కనికరం కూడా లేకుండా..

1998 జనవరి 25న సాయుధులైన లష్కర్ ఎ తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్లకు చెందిన ఉగ్రవాదులు సైనికుల దుస్తుల్లో వచ్చి గండేర్ బల్ జిల్లాలోని కశ్మీరీ పండిట్ల గ్రామమైన వాంధామాపై దాడి చేశారు. కశ్మీరీ పండిట్లను వరుసలో నిలబెట్టి 23 మందిని కాల్చి చంపారు. మృతుల్లో తొమ్మిది మంది మహిళలు, రెండు, నాలుగేళ్ల వయసున్న నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. కశ్మీర్ లోయను విడిచిపెట్టి వెళ్లా లన్న తమ హెచ్చరికలను ఖాతరు చేయక వాందామాలోనే ఉండిపోవాలని నిర్ణయించుకు న్నందుకే ఉగ్రవాదులు కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని మారణకాండకు పాల్పడ్డారు. 28 ఏళ్ల తర్వాత ఈ కేసు పునర్విచారణలో భాగంగా ఎస్ఐ ఇటీవలే పలుచోట్ల దాడులు నిర్వహించింది.