News

యూపీలో పోలీసులకు, గో స్మగ్లర్లకు మధ్య కాల్పులు

6views

ఉత్తర్‌ప్రదేశ్‌లో గోవుల అక్రమ రవాణా, గోవధకు పాల్పడుతున్నారన్న సమాచారంతో వెళ్లిన పోలీసులకు, నిందితులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అనుమానిత గో స్మగ్లర్లు తీవ్రంగా గాయపడ్డారు. మరో వ్యక్తి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు.

మీరట్‌లో ఆదివారం కొందరు వ్యక్తులు గోవులను అక్రమంగా తరలించి గోవధకు పాల్పడుతున్నారన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ ఓ గోవును చెట్టుకు కట్టేసి ఉన్నట్లు గుర్తించారు.

పోలీసులు అక్కడికి చేరుకున్న విషయాన్ని గమనించిన తస్లీమ్‌, భూరా అనే నిందితులు కాల్పులు జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో తస్లీమ్‌, భూరా తీవ్రంగా గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

అయితే మరో నిందితుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అతడి కోసం పోలీసులు ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు.

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. తస్లీమ్‌పై ఇప్పటికే 15 కేసులు, భూరాపై 10 కేసులు నమోదై ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.