News

ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదు.. యూపీ విద్యార్థిని పిటిషన్‌ను కొట్టివేసిన అలహాబాద్ హైకోర్టు..

4views

పాఠశాల యూనిఫామ్‌తో పాటు హిజాబ్ లేదా తలపై స్కార్ఫ్ ధరించేందుకు అనుమతించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. ఇస్లాంలో మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరి అని నిరూపించేందుకు తగిన వాస్తవ లేదా చట్టపరమైన ఆధారాలు సమర్పించలేదని కోర్టు పేర్కొంది.

ప్రయాగ్‌రాజ్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న ఓ బాలిక తన తల్లి ద్వారా హైకోర్టును ఆశ్రయించింది. ఆరో తరగతి నుంచి తాను హిజాబ్ ధరిస్తున్నానని, అదే పాఠశాలలో 11వ తరగతిలో ప్రవేశం పొందుతున్న నేపథ్యంలో యూనిఫామ్‌తో పాటు హిజాబ్ ధరించేందుకు అనుమతించాలని ఆమె కోరింది. అయితే పాఠశాల నిర్దేశించిన యూనిఫామ్‌కు అదనంగా మరో వస్త్రాన్ని జోడించేందుకు విద్యార్థికి ప్రత్యేక హక్కు లేదని జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ ఇంద్రజీత్ శుక్లాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది .

హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి మతాచారం అని చెప్పేందుకు పిటిషన్‌లో ఎలాంటి బలమైన ఆధారాలూ లేవని ధర్మాసనం పేర్కొంది. ఇదే అంశంపై గతంలో వివిధ హైకోర్టులు ఇచ్చిన తీర్పులను కూడా కోర్టు ప్రస్తావించింది. హిజాబ్ ధరించకపోతే ఇస్లామిక్ విశ్వాసానికి భంగం కలుగుతుందని నిరూపించే స్థాయిలో ఆధారాలు లేవని ధర్మాసనం అభిప్రాయపడింది. అదే పాఠశాలలో చదువుతున్న ఇతర ముస్లిం బాలికలు హిజాబ్ ధరించడంలేదని పేర్కొంది. విద్యార్థులందరికీ సమానమైన యూనిఫామ్ నిబంధనలను అమలు చేసే అధికారం ప్రైవేట్ విద్యాసంస్థలకు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.