
అమరావతి: గోదావరి మహానదిని ఆరాధిస్తూ.. పుణ్యస్నానాలు, పూజలు, ధార్మిక కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వైభవాన్ని చాటేలా వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రకృతి ఆరాధన, సనాతన ధార్మిక సంప్రదాయాలు, ఆధ్యాత్మిక చింతన మమేకమయ్యేలా పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. గోదావరి పుష్కరాలకు దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2027 పుష్కరాల్లో 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
గోదావరి పుష్కరాలకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని పవిత్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. పుష్కర ఘాట్ల వద్ద పరిశుభ్రత, తాగునీరు, పారిశుద్ధ్యం, భక్తుల భద్రత వంటి అంశాల్లో ఎక్కడా లోటు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా గోదావరిలోకి మురుగునీరు చేరకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు పుణ్యస్నానాలతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనం కల్పించేలా ప్రత్యేక టెంపుల్ టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పిఠాపురం శక్తిపీఠం, పంచారామ క్షేత్రాల్లోని నాలుగు పుణ్యక్షేత్రాలు, ద్వారకా తిరుమల, అన్నవరం, వాడపల్లి, అంతర్వేది వంటి ప్రముఖ ఆలయాలను అనుసంధానించాలని ఆదేశించారు.
గోదావరి తీరంలోని ఈ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం ద్వారా భక్తులకు పుష్కర యాత్ర మరింత ఆధ్యాత్మిక అనుభూతిని అందించేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పుష్కరాలకు వచ్చే భక్తులు ఒకే యాత్రలో పుణ్యస్నానం, ఆలయ దర్శనం, గోదావరి తీరంలోని ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శన చేసేలా సౌకర్యాలు కల్పించనున్నారు.
గోదావరి నదికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ‘అఖండ గోదావరి’ పేరుతో పుష్కరాలను నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. గోదావరి జన్మస్థానం నుంచి సముద్ర సంగమం వరకు అనేక ఉపనదులు, వాగులు, ఏరులు ఈ మహానదిలో కలుస్తున్న నేపథ్యంలో గోదావరి సమగ్ర ప్రవాహ ప్రాంతాన్ని ఆధ్యాత్మికంగా అనుసంధానించేలా పుష్కరాలను నిర్వహించాలన్న ఆలోచనను ఆయన వ్యక్తం చేశారు.
పుష్కరాల్లో ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను భారీ స్థాయిలో నిర్వహించాలని కూడా సీఎం సూచించారు. రాష్ట్ర సనాతన సంప్రదాయాలు, కళలు, ఆధ్యాత్మిక వారసత్వాన్ని దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులకు పరిచయం చేసేలా కార్యక్రమాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కూచిపూడి వంటి భారతీయ శాస్త్రీయ కళా కార్యక్రమాలను కూడా ఘనంగా నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
పుష్కరాల సందర్భంగా దేశ, విదేశాల్లోని ప్రముఖులను ఆహ్వానించాలని చంద్రబాబు తెలిపారు. గోదావరి పుష్కరాలను కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా.. ప్రజల భాగస్వామ్యంతో జరిగే మహా ఆధ్యాత్మిక వేడుకగా నిర్వహించాలని సూచించారు.
భక్తుల ఆరోగ్య భద్రత కోసం 30 తాత్కాలిక ఫీల్డ్ ఆస్పత్రులు, వైద్య శిబిరాలు, అంబులెన్స్‌లు, ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పుష్కర ప్రాంతాల్లో రహదారులు, వసతి, పారిశుద్ధ్యం, తాగునీరు వంటి సౌకర్యాలను కూడా మెరుగుపరచనున్నారు.
గోదావరి పుష్కరాల కోసం మొత్తం రూ.4,026 కోట్లతో 4,932 పనులు చేపడుతున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇందులో ఘాట్ల అభివృద్ధి, ఆలయాలు మరియు పుణ్యక్షేత్రాలకు అనుసంధాన రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు, రవాణా, విద్యుత్, భద్రత తదితర మౌలిక వసతులు ఉన్నాయి.
గోదావరి తీరంలో జరిగే పుష్కరాలు కోట్లాది మంది భక్తులకు పుణ్యస్నానం, పితృదేవతల స్మరణ, దేవతారాధన, ఆలయ దర్శనాలతో కూడిన మహత్తర ఆధ్యాత్మిక అనుభూతిని అందించేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.





