News

పాకిస్తాన్ కుట్రల బారిన పడకుండా గురుద్వారాల ద్వారా ISI ప్రమాదాలపై అవగాహన

20views

పాకిస్తాన్ తన దుష్టచర్యలను మానడం లేదు. పంజాబ్‌లో ఉగ్రవాదాన్ని, యువతను మత్తుపదార్థాలకు బానిసలుగా చేసే కుట్రలు చేస్తోంది. దీనిని తిప్పికొట్టడానికి పంజాబ్‌లోని సిక్కు సమాజం పాకిస్తాన్‌పై పోరాటం ప్రారంభించింది. గురుద్వారాల ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు: “పాకిస్తాన్ కుట్రల బారిన పడకుండా జాగ్రత్తపడండి. పాకిస్తాన్ గూఢచారి సంస్థ ISI పంజాబ్ పిల్లలను తప్పుదోవ పట్టిస్తోంది.”

సరిహద్దు గ్రామాల్లో ప్రతిరోజు హెచ్చరికలు
పంజాబ్ సరిహద్దు ప్రాంతాల గురుద్వారాల్లో ప్రతిరోజు ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పంజాబ్ యువతను, పిల్లలను పాకిస్తాన్ నాపాక్ ఆలోచనల నుండి కాపాడడం, తల్లిదండ్రులను అప్రమత్తం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. గ్రామాల్లోని గురుద్వారాల నుండి సాయంత్రం రెహిరాస్ సాహిబ్ పాఠం ముగిసిన తర్వాత యువత పాకిస్తాన్ గూఢచారి సంస్థ ISI కుట్రలతో పాటు మత్తుపదార్థాలు, నేరాలు, గ్యాంగ్‌స్టర్ సంస్కృతికి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గురుద్వారాల లౌడ్‌స్పీకర్ల ద్వారా గ్రంథితో పాటు పోలీసులు ప్రతిరోజూ సాయంత్రం పొరుగు దేశం పన్నుతున్న కుట్రల నుండి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

149 మంది మైనర్ల నిర్బంధం ఆందోళనకరం
గడిచిన మూడేళ్లలో ఆయుధాలు, మత్తుపదార్థాల అక్రమ రవాణాతో పాటు గ్రెనేడ్ దాడులు, గ్యాంగ్‌స్టర్ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు రాష్ట్రంలో 149 మంది మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ISI ఇచ్చిన కొద్దిపాటి డబ్బు ఆశకు లొంగిపోయినట్లు పలువురు మైనర్లు విచారణలో వెల్లడించారు.

పంచాయతీలతో సమన్వయం
బోర్డర్ రేంజ్ డిఐజి హర్మాన్‌బీర్ సింగ్ గిల్ మాట్లాడుతూ… అమృత్‌సర్‌తో పాటు పఠాన్‌కోట్, గుర్దాస్‌పూర్, బటాలా సరిహద్దు ప్రాంతాల గ్రామాల్లో గురుద్వారాల ద్వారా సాయంత్రం వేళల్లో ఈ ప్రకటనలు చేయిస్తున్నట్లు తెలిపారు. యువతను కాపాడటానికి పంచాయతీలతో కూడా సమన్వయం చేసుకుంటున్నామని, దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

గురుద్వారాల ద్వారా పిలుపు
తల్లిదండ్రులు తమ పిల్లలపై కన్నువేసి ఉంచాలని గురుద్వారాల నుండి విజ్ఞప్తి చేస్తున్నారు. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, సోషల్ మీడియా వేదికలపై వారి కార్యకలాపాలు ఏమిటి అనేది గమనించాలని సూచిస్తున్నారు. పిల్లల ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు, అనుమానాస్పద ఆన్‌లైన్ సంభాషణలు, గ్యాంగ్‌స్టర్ సంస్కృతి పట్ల పెరుగుతున్న ఆకర్షణను గమనించాలని కోరుతున్నారు. ఇటువంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని యువతకు సందేశం ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో దేవాలయాలు, చర్చీల నుండి కూడా ఇలాంటి విజ్ఞప్తులు చేయించనున్నారు.

సమాచార మార్పిడికి గురుద్వారాలు కీలక మాధ్యమం
పంజాబ్‌లో గురుద్వారాలు కేవలం మతపరమైన ప్రార్థనా స్థలాలు మాత్రమే కావు. సామాజిక సమాచార మార్పిడికి అత్యంత ప్రభావవంతమైన మాధ్యమాలు. గ్రామంలో ఉచిత వైద్య శిబిరం, రేషన్ పంపిణీ, ఏదైనా వస్తువు దొరకడం లేదా పోవడం, అనుమానాస్పద వ్యక్తుల సమాచారం ఇవ్వడం వంటి ఏ విషయమైనా గురుద్వారాల లౌడ్‌స్పీకర్ల ద్వారా గ్రంథి సింగ్ ప్రకటిస్తారు. దీనికి ఎటువంటి రుసుము తీసుకోరు, ఊరు మొత్తానికి ఒకేసారి సమాచారం చేరుతుంది. మత్తుపదార్థాలు, అసాంఘిక శక్తులకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు పోలీసులు గురుద్వారాల సహాయం తీసుకోవడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు.