News

సాంగ్లీలో హిందూ దంపతులపై దాడి..

5views

మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో దంపతులపై దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. కుప్వాడ్ పట్టణంలో చెత్త పారవేసే విషయంలో తలెత్తిన వివాదం దాడికి దారితీసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మనీష కేసరేకర్ (35) మృతి చెందగా.. ఆమె భర్త మోహన్ కేసరేకర్ (45) తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ కేసులో కుప్వాడ్‌లోని విఘ్నహర్త శాంతి కాలనీకి చెందిన ఫరీద్ షేక్ (52)ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు సుత్తి, కత్తితో దంపతులపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ విభాగం అధికారులు గాలింపు చేపట్టి.. సాంగ్లీ-మిరాజ్ రోడ్డులోని ఓ భవనం వద్ద రెండు గంటల్లోనే ఫరీద్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనంతరం తదుపరి చట్టపరమైన చర్యల కోసం కుప్వాడ్ పోలీసులకు అప్పగించారు.

అసలు ఏం జరిగింది?
మోహన్ కేసరేకర్ కుమార్తె మనాలి తెలిపిన వివరాల ప్రకారం.. తమ కుటుంబం కొత్త ఇంటికి మారినప్పటి నుంచి ఫరీద్ తరచూ వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. తమను ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని బెదిరించేవాడని, ఇంటి ముందు చెత్త వేయడం, ఇంటిపైకి రాళ్లు, ఇతర వస్తువులు విసరడం వంటి చర్యలకు పాల్పడేవాడని ఆమె పేర్కొన్నారు.

ఘటన జరిగిన రోజు ఉదయం కూడా తమ ఇంటి ముందు చెత్త వేయడంతో కుటుంబ సభ్యులు ఫరీద్‌ను ప్రశ్నించారని తెలిపారు. దీంతో వివాదం తలెత్తిందని చెప్పారు.

ఆ తర్వాత ఫరీద్ బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి తన తండ్రి మోహన్‌పై దాడి చేసినట్లు మనాలి ఆరోపించారు. తొలుత చెంపదెబ్బ కొట్టి, అనంతరం సుత్తితో తలపై కొట్టినట్లు తెలిపారు. తల్లి మనీష అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఆమెపై కత్తితో దాడి చేసినట్లు ఆరోపించారు. తీవ్ర గాయాలతో మనీష అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

దాడి అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. పోలీసులు అతడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు గల పూర్తి కారణాలు, దాడి వెనుక ఇతర అంశాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.