
హైదరాబాద్: ప్రముఖ నటి, ‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియాలో భావోద్వేగానికి లోనయ్యారు. బోనాల పండుగలో పాల్గొన్నందుకు తనను ట్రోల్ చేస్తున్న వారిపై ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. తన కుటుంబ నేపథ్యాన్ని వివరిస్తూ సుదీర్ఘ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న ఆమె.. ద్వేషాన్ని ప్రేమతోనే జయిస్తానని స్పష్టం చేశారు.
ఇటీవల హైదరాబాద్ పాతబస్తీలోని మీర్ ఆలం మండిలో ఉన్న శ్రీ మహాకాళేశ్వర అమ్మవారి ఆలయంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో ఫరియా అబ్దుల్లా పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో బంగారు బోనం ఎత్తుకున్న ఆమె.. డప్పు చప్పుళ్లకు ఉత్సాహంగా నృత్యం చేశారు. సంస్కృతి, సంప్రదాయాలపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
అయితే ముస్లిం కుటుంబ నేపథ్యం ఉన్న ఫరియా హిందూ పండుగలో పాల్గొనడాన్ని కొందరు సోషల్ మీడియా యూజర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమెను ‘కాఫిర్’ అంటూ దూషిస్తూ.. మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారంటూ ట్రోల్ చేశారు.
ఈ ట్రోలింగ్‌పై ఫరియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో భావోద్వేగానికి గురయ్యారు. తనను ‘కాఫిర్’ అంటూ ద్వేషించే వారికి కూడా మంచి జరగాలని కోరుకుంటానని ఫరియా చెప్పారు. “నేను ద్వేషాన్ని ప్రేమతోనే ఎదుర్కొంటాను” అని ఆమె స్పష్టం చేశారు.
ప్రకృతిలోని చెట్లు, పుట్టలు, సీతాకోకచిలుకలు.. ఇలా ప్రతి అంశంలోనూ తాను దైవాన్ని చూస్తానని ఫరియా తెలిపారు. అన్నింటిలో భగవంతుడిని చూడలేకపోతే జీవితంలో చాలా కోల్పోతామని అన్నారు.
తన ప్రేమను, భావాలను వ్యక్తం చేసే స్వేచ్ఛను ఎవరూ అడ్డుకోలేరని ఫరియా పేర్కొన్నారు. “ఇదే నా తిరుగుబాటు” అంటూ తన వైఖరిని స్పష్టం చేశారు.
ఫరియా అబ్దుల్లాకు నటి లక్ష్మీ మంచుతో పాటు పలువురు నెటిజన్లు, అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు సంఘీభావం తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు.





