News

చంద్రుడిపై శాశ్వత స్థావరం.. భారత్‌ను భాగస్వామిగా ఆహ్వానించిన నాసా

9views

చంద్రుడిపై శాశ్వత స్థావరం ఏర్పాటు చేయాలన్న అమెరికా ప్రణాళికలో భారత్‌ భాగస్వామి అయ్యే అవకాశం ఉంది. నాసా ప్రతిపాదించిన ‘మూన్‌ బేస్‌’ కార్యక్రమంలో చేరాలని ఇస్రోను అమెరికా ఆహ్వానించింది. బెంగళూరులో ఆగస్టు 5, 6 తేదీల్లో జరిగిన భారత్‌-అమెరికా సివిల్‌ స్పేస్‌ జాయింట్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశంలో ఈ ఆహ్వానం అందింది.

చంద్రుడిపై శాశ్వత స్థావరం
చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంలో మానవులు నివసించే తొలి శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేయాలన్నది నాసా ప్రణాళిక. వ్యోమగాములు అక్కడ నివసించడంతో పాటు పరిశోధనలు చేయనున్నారు. ఇందుకోసం మానవ సహిత, మానవ రహిత మిషన్ల ద్వారా అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా ఏర్పాటు చేయనున్నారు.

చంద్రుడి దక్షిణ ధ్రువానికే నాసా ప్రాధాన్యం ఇస్తోంది. అక్కడ శాశ్వతంగా నీడలో ఉండే కొన్ని ప్రాంతాల్లో మంచు రూపంలో నీరు ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ నీటిని తాగడానికి, ఆక్సిజన్, రాకెట్‌ ఇంధనంగా మార్చుకునే అవకాశం ఉంది. భవిష్యత్తులో అంగారకుడిపై మానవ యాత్రలకు చంద్రుడిని కీలక కేంద్రంగా ఉపయోగించుకోవాలన్నది నాసా లక్ష్యం.

భారత్‌ అనుభవానికి గుర్తింపు
చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో విజయవంతంగా సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసిన తొలి దేశంగా భారత్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. 2023 ఆగస్టులో చంద్రయాన్‌-3లోని విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ అక్కడ దిగాయి. ల్యాండింగ్‌ ప్రాంతానికి ‘శివశక్తి పాయింట్‌’గా పేరు పెట్టారు. నాసా ఇప్పుడు అదే ప్రాంతంలో స్థావరం ఏర్పాటుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇస్రో అనుభవం కీలకంగా మారనుంది.

ఆర్టెమిస్‌ ఒప్పందంతో ముందుకు
మూన్‌ బేస్‌ సహకారం ఆర్టెమిస్‌ అకార్డ్స్‌ కింద భారత్‌-అమెరికా భాగస్వామ్యానికి కొనసాగింపుగా ఉండనుంది. శాంతియుత, పారదర్శక, సుస్థిర అంతరిక్ష అన్వేషణకు ఈ ఒప్పందం మార్గదర్శకంగా ఉంటుంది. 2023 జూన్‌ 21న భారత్‌ ఆర్టెమిస్‌ అకార్డ్స్‌పై సంతకం చేసింది.

బెంగళూరు సమావేశంలో అంతరిక్ష పరిశోధనల నుంచి లభించే శాస్త్రీయ సమాచారాన్ని పరస్పరం పంచుకోవడంపైనా చర్చలు ముందుకు తీసుకెళ్లాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.

నిసార్‌ నుంచి చంద్రుడి వరకు
భారత్‌, అమెరికా ఇప్పటికే నిసార్‌ ఉపగ్రహం ద్వారా భారీ అంతరిక్ష సహకారాన్ని కొనసాగిస్తున్నాయి. భవిష్యత్‌లో శాస్త్రీయ పరిశోధనలు, మానవ అంతరిక్ష ప్రయాణ సాంకేతికతపై కలిసి పనిచేయాలని తాజా సమావేశంలో నిర్ణయించారు.

భారత్‌ గగన్‌యాన్‌ కార్యక్రమంతో మానవ అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతోంది. అంతరిక్ష కేంద్రం ఏర్పాటు, భవిష్యత్తులో చంద్రుడిపై మానవ కార్యకలాపాల వంటి లక్ష్యాలను ‘స్పేస్‌ విజన్‌ 2047’లో భారత్‌ నిర్దేశించుకుంది. ఈ నేపథ్యంలో నాసా ఆహ్వానం ఇస్రోకు కీలక అవకాశంగా మారనుంది.