News

మొదటి సారిగా ఎర్రకోట నుంచి పూర్తి వందేమాతరం ఆలాపన

25views

ఈ సారి పంద్రాగస్టు వేడుకలు మరింత ప్రత్యేకం కానున్నాయి.ఈ సారి పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ఎర్రకోట పై నుంచి పూర్తి వందేమాతర గీతాన్ని ఆలాపించనున్నారు. ఇలా జరగడం ఇదే ప్రథమం. వందేమాతరం గీతానికి ఈ ఏడాది వేడుకల్లో ప్రత్యేక స్థానం కల్పించబోతున్నారు. జాతీయ గీతానికి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ముందుగా కొన్ని కార్యక్రమాల్లో వందేమాతరం గీతంలోని ఆరు చరణాలను ఆలపించేందుకు ముందుగానే నిబంధనలు కూడా జారీ చేసింది.

న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, 2026 నాటికి ‘వందేమాతరం’ గీతానికి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, స్వాతంత్ర్యోద్యమ కాలంలో కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చిన ఈ జాతీయ గీతాన్ని దాని చిరస్థాయి వారసత్వానికి నివాళిగా ఎర్రకోట ప్రాకారంపై తొలిసారిగా ఆలపించనున్నట్లు తెలిపారు.ఎర్రకోటపై వందేమాతరాన్ని ఆలపించడం చరిత్రలో ఇదే మొదటిసారి అని వెల్లడించారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

‘యువ శక్తి – వికసిత్ భారత్ దిశగా ప్రయాణానికి సారథ్యం’ అనే థీమ్ తో ఈ సారి వేడుకలు జరగనున్నాయి. దేశాభివృద్ధిలో భారతీయ యువత పోషిస్తున్న పాత్రపై దృష్టి సారిస్తుంది. ఎర్రకోట వద్దకు ప్రధాని మోదీ రాకతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వందేమాతర పూర్తి గీతం పాడతారని, ఆ తర్వాత జాతీయ జెండావిష్కరణ కార్యక్రమం వుంటుందని అధికారులు తెలిపారు.

మరొక విశేషం ఏమిటంటే, ఎర్రకోట వద్ద జరగనున్న ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికలలో రక్షణ శాఖ ‘వందేమాతరం’ గీతం మొత్తాన్ని పొందుపరిచారు. ఈ ఆహ్వాన పత్రికలలో జాతీయ గీతానికి సంబంధించిన మొత్తం ఆరు చరణాలు ఉన్నాయి.

ఎర్రకోట వేడుకలో వందేమాతరం గీతాన్ని చేర్చడం చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. బంకిం చంద్ర చటోపాధ్యాయ రచించిన ఈ గీతం, భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి ఒక ముఖ్యమైన చిహ్నంగా నిలిచింది మరియు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమ సమయంలో తరతరాల భారతీయులకు స్ఫూర్తినిచ్చింది.ప్రజలను ఏకం చేయడానికి దీనిని ఒక నినాదంగా ఉపయోగించడంతో, జాతీయోద్యమంలో ‘వందేమాతరం’ కీలక పాత్ర పోషించింది.