
మీరట్ : భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత ప్రబంధ సమితి సమావేశాలు మాధవ్ కుంజ్ కాంప్లెక్స్ లో జరిగాయి. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరిగాయి. గ్రామాల్లోని రచ్చబండ వద్ద జరిగే చర్చలు దేశ విధానాలను రూపొందించే వారికి చేరేలా వుండాలని, ఇంతలా గ్రామాలను శక్తిమంతం చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ అభిప్రాయపడింది.
రాబోయే సంవత్సరం అంతా కూడా భారతీయ కిసాన్ సంఘ్ సభ్యత్వ నమోదు సంవత్సరంగా ప్రకటిస్తున్నట్లు భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి మోహిని మోహన్ మిశ్రా ప్రకటించారు. ఈ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా సాధ్యమైనన్ని ఎక్కువ గ్రామాల్లో సభ్యులను చేర్చుకోవడం ద్వారా సంస్థను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించామని తెలిపారు.
ఇథనాల్ వల్ల రైతుల ఆదాయం పెరగడమే కాకుండా పర్యావరణం కూడా మెరుగుపడిందని దేశవ్యాప్తంగా ఉన్న రైతులు భావిస్తున్నారని ఆయన అన్నారు. విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసే దృష్ట్యా ఇది ఒక కీలకమైన ముందడుగు అని కూడా అభిప్రాయపడ్డారు.
దేశంలోని రైతులు మరియు రైతు అనుకూల వ్యక్తులు దీనికి అనుకూలంగా తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. మార్కెట్‌లో రైతులకు మంచి ధర లభించే అవకాశం వచ్చినప్పుడల్లా, దేశంలోని రైతు వ్యతిరేక శక్తులు వెంటనే ద్రవ్యోల్బణం పేరుతో గందరగోళం సృష్టిస్తాయని, రైతులకు మంచి ధర దక్కకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాయని ఆరోపించారు.
ఈ సమావేశంలో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన అంశంపై కూడా చర్చ జరిగిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ ఒప్పందానికి సంబంధించిన చర్చలు నిలిచిపోయినప్పటికీ, వ్యవసాయం, పాడి పరిశ్రమ మరియు మత్స్య రంగానికి సంబంధించి ఎటువంటి ఒప్పందం ఉండదని ప్రభుత్వం పదేపదే స్పష్టం చేస్తూనే ఉంది. ఈ హామీతో రైతులు భరోసా పొందారు. చర్చలు ఎప్పుడు ప్రారంభమైనా వాటిపై తాము నిశితంగా గమనిస్తూనే ఉంటామని కిసాన్ సంఘ్ పేర్కొన్నారు.
అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరం’ సందర్భంగా, సెప్టెంబర్ 30న ఢిల్లీలో ఒక భారీ మహిళా రైతుల సదస్సును నిర్వహించేందుకు భారతీయ కిసాన్ సంఘ్ సన్నాహాలు చేస్తోంది. ఈ సమావేశంలో సదస్సు ఏర్పాట్లపై కూడా చర్చించామని మోహన్ మిశ్రా తెలిపారు.దేశవ్యాప్తంగా వేలాది మంది మహిళలు ఇందులో పాల్గొంటారని తెలిపారు.గో-ఆధారిత సేంద్రీయ వ్యవసాయం, విషరహిత ఆహారం, వ్యాధిరహిత జీవనం, స్వయం సమృద్ధి మరియు కుటుంబ విద్య వంటి అంశాలు ఇందులో చర్చకు రానున్నాయని ప్రకటించారు.
అధిక దిగుబడి పేరుతో బీటీ (BT) పత్తిని ప్రవేశపెట్టి, తద్వారా మన స్వయం సమృద్ధిని దెబ్బతీసి పత్తి సాగును నాశనం చేసినట్లే, ఇప్పుడు కొందరు ‘జీన్-ఎడిటెడ్’ వరి సాగు ద్వారా వరి విషయంలోనూ మన స్వయం సమృద్ధిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.భారతీయ కిసాన్ సంఘ్ దీనిని తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు.





