
పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే జీవితంలో ఏదైనా సాధించొచ్చు. లక్ష్యాన్ని చేరుకునేందుకు వయసు ఏమాత్రం అడ్డంకి కాదు. ఇదే విషయాన్ని రుజువు చేసి చూపించారు ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌కు చెందిన అన్నాచెల్లెళ్లు. భక్తి, శారీరక దృఢత్వం, సామాజిక సామరస్యం అనే సందేశాలను చాటిచెప్పేందుకు స్కేటింగ్ చేస్తూ కన్వర్ యాత్ర చేపట్టారు. ఈ క్రమంలో యుగ్ (12), నందిని (10)పై ప్రశంసలు కురుస్తున్నాయి.
రోజుకు 70-80కి.మీలు స్కేటింగ్
గాజియాబాద్ నుంచి అయోధ్య వరకు సుమారు 750 కిలోమీటర్ల దూరం స్కేటింగ్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన ఈ అన్నాచెల్లెళ్లు మరో మతపరమైన యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు కన్వర్ యాత్రను చేపట్టారు. ఇందులో భాగంగా వారు హరిద్వార్‌లోని ‘హర్ కీ పౌఢీ’ నుంచి గాజియాబాద్‌లోని శాస్త్రీనగర్‌కు పవిత్ర జలాలను తీసుకెళ్తున్నారు. అందుకోసం రోజుకు సుమారు 70- 80 కిలోమీటర్ల మేర స్కేటింగ్ చేస్తున్నారు. గాజియాబాద్ చేరుకుని హరిద్వార్ నుంచి తీసుకొచ్చిన ఆ పవిత్ర జలాలతో శివునికి అభిషేకం (జలాభిషేకం) చేయాలన్నది యుగ్, నందినిల లక్ష్యం. దీంతో అన్నాచెలెళ్ల కన్వర్ యాత్ర పూర్తవుతుంది.
తాత ఆరోగ్యం కుదుటపడానికి శివయ్యకు ప్రార్థనలు
ఈ అన్నాచెల్లెళ్ల కన్వర్ యాత్ర భక్తి, శారీరక దృఢత్వం, సామాజిక సామరస్యాల అద్భుత కలయికకు వేదికగా నిలుస్తోంది. వీరు శివుని పట్ల భక్తితో పాటు దేశవ్యాప్తంగా శాంతి, సోదరభావం, శారీరక దృఢత్వం గురించిన సందేశాన్ని ఈ యాత్రలో వ్యాప్తి చేస్తున్నారు. తమ తాతయ్య ఆరోగ్యం కుదుటపడాలని శివుడిని (భోలేనాథ్) ప్రార్థిస్తున్నారు. యుగ్, నందిని ఇద్దరూ గతంలో స్కేటింగ్‌లో స్వర్ణ పతకాలను గెలుచుకున్నారు. క్రీడలను భక్తి, సంప్రదాయ విలువలతో అనుసంధానించడం ద్వారా యువతను సానుకూల దిశలో నడిపించవచ్చని వారు నమ్ముతున్నారు.
గతంలో గాజియాబాద్- అయోధ్య వరకు యాత్ర
పదేళ్ల నందిని (ఆరో తరగతి విద్యార్థిని), యుగ్ (ఏడో తరగతి విద్యార్థి) గతంలో స్కేటింగ్ చేస్తూ సుదూర మతపరమైన యాత్రలు చేశారు. ఈ ఏడాది జనవరిలో యుగ్, నందిని కలిసి గాజియాబాద్ నుంచి అయోధ్య వరకు సుమారు 750 కిలోమీటర్ల స్కేటింగ్ యాత్రను పూర్తి చేశారు. ఈ క్రమంలో ‘ఇన్‌ఫ్లూయెన్సర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు సంపాదించుకున్నారు. ఈ అవార్డును వారు తమ గురుదేవులకు అంకితం చేశారు. మళ్లీ ఇప్పుడు పవిత్రమైన శ్రావణ మాసంలో కన్వర్ యాత్రకు శ్రీకారం చుట్టారు. శివుని పట్ల భక్తితో ఈ అన్నాచెల్లెళ్లు స్కేటింగ్ చేస్తూ కన్వర్ యాత్రను చేపట్టారు.
స్కేటింగ్‌పై కన్వర్ యాత్ర చేస్తున్న ఈ అన్నాచెల్లెళ్లను చూసేందుకు దారి మధ్యలో ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడుతున్నారు. ఆ పిల్లల కృషి, వారు ఇస్తున్న సందేశం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అన్నాచెల్లెళ్ల ఈ స్కేటింగ్ యాత్ర యావత్ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తోంది. శివుడిపై ఆ చిన్నారులకు ఉన్న భక్తిని తెలియజేస్తోంది.





