
ఉత్తరప్రదేశ్: గుర్తింపును దాచిపెట్టి ఓ హిందూ మహిళను వివాహం చేసుకున్నాడని, అనంతరం ఆమెను మతం మార్చుకోవాలని ఒత్తిడి చేశాడన్న ఆరోపణలపై వారణాసిలోని సిగ్రా పోలీసులు సాజిద్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఉత్తరప్రదేశ్ మత మార్పిడి నిరోధక చట్టంతో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. నిందితుడు తనను ‘రాజు’గా పరిచయం చేసుకుని బాధితురాలితో పరిచయం పెంచుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆమెను వివాహం చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే వివాహం జరిగిన కొద్ది రోజుల తర్వాత తన భర్త అసలు పేరు సాజిద్ అని, అతను ముస్లిం అని తెలుసుకున్నట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది.
తన అసలు గుర్తింపు బయటపడిన తర్వాత సాజిద్తో పాటు అతని కుటుంబ సభ్యులు తనపై మత మార్పిడికి ఒత్తిడి తెచ్చారని బాధితురాలు ఆరోపించింది.,మతం మార్చుకోవడానికి తాను నిరాకరించడంతో తనను శారీరకంగా, మానసికంగా వేధించారని, తనపై దాడి కూడా చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
కేసు నమోదు.. దర్యాప్తు కొనసాగింపు
బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన సిగ్రా పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన ఆరోపణలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు, నిందితుడి వాంగ్మూలం, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం కేసులో తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.





