News

ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక, పర్యాటక నగరంగా అయోధ్య : యోగి ఆదిత్యనాథ్‌

9views

రామాలయ విరాళాల చోరీ ఆరోపణల వివాదం కొనసాగుతున్న వేళ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ హనుమాన్‌గఢి అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. అయోధ్య పర్యటన సందర్భంగా రూ.432 కోట్ల విలువైన 217 అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఆయన.. అనంతరం జరిగిన సభలో ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు.

గత ప్రభుత్వాల హయాంలో అయోధ్య నిర్లక్ష్యానికి గురైందని యోగి ఆరోపించారు. ఒకప్పుడు రహదారులు, విద్యుత్‌, తాగునీటి సౌకర్యాలు కూడా లేవని చెప్పారు. ప్రస్తుతం విశ్వాసం గురించి మాట్లాడుతున్నవారే గతంలో హనుమాన్‌గఢి మెట్లపై నమాజ్‌ చేయించారని విమర్శించారు. పరోక్షంగా రామమందిర విరాళాల చోరీని ప్రశ్నిస్తున్నవారిపై విమర్శలు గుప్పించారు. ‘‘జామా మసీదులో హనుమాన్‌ చాలీసా చదవనిస్తారా? అలా కాకపోతే హనుమాన్‌గఢి మెట్లపై నమాజ్‌ జరగడానికి ఎందుకు అనుమతించారు? దానికి బాధ్యులు ఎవరు?’’ అని ప్రశ్నించారు.

తమ ప్రభుత్వం అయోధ్యను పరిశుభ్రమైన, అందమైన నగరంగా తీర్చిదిద్దిందని యోగి తెలిపారు. సరయూ నది తీరంలో ఘనంగా హారతి, రామ్‌కీ పైడీ అభివృద్ధి వంటి పనులతో అయోధ్యకు కొత్త గుర్తింపు వచ్చిందన్నారు. స్పష్టమైన విధానాలు, రాజకీయ సంకల్పం ఉంటే అసాధ్యమేమీ ఉండదని పేర్కొన్నారు.

అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణాన్ని గతంలో సమాజ్‌వాదీ పార్టీ వ్యతిరేకించిందని యోగి ఆరోపించారు. ప్రస్తుతం మహర్షి వాల్మీకి పేరుతో ఉన్న ఆ విమానాశ్రయం దేశ, విదేశాలతో అయోధ్యను అనుసంధానిస్తోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్‌తో అయోధ్యను దేశంలోని ఎంపిక చేసిన సోలార్‌ నగరాల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

శ్రీరాముడి తమ్ముడు భరతుడి గౌరవార్థం భదర్సా ప్రాంతానికి ‘భారత్‌పూర్‌-భరత్‌కుండ్‌’గా పేరు మారుస్తామని యోగి ప్రకటించారు. ప్రపంచంలో ఎక్కడైనా అయోధ్య పేరు వినగానే భారతీయుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోందని, 500 ఏళ్లుగా సాధ్యం కానిది ఇప్పుడు సాకారమైందని వ్యాఖ్యానించారు.